దిల్లీ ముట్టడి నేడే

హస్తిన వేదికగా మరోసారి కదం తొక్కేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో సోమవారం జరిపిన చర్చలు విఫలమవడంతో.. ముందుగానే నిర్ణయించినట్లు ‘దిల్లీ చలో’ పేరుతో మంగళవారం భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Updated : 13 Feb 2024 15:25 IST

హస్తినకు భారీగా పోటెత్తనున్న రైతులు
అడ్డుకునేందుకు పోలీసుల వ్యూహరచన

చండీగఢ్‌, దిల్లీ: హస్తిన వేదికగా మరోసారి కదం తొక్కేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో సోమవారం జరిపిన చర్చలు విఫలమవడంతో.. ముందుగానే నిర్ణయించినట్లు ‘దిల్లీ చలో’ పేరుతో మంగళవారం భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. మరోవైపు- ‘దిల్లీ చలో’ను భగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హస్తిన సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. 

కుదరని సయోధ్య

‘దిల్లీ చలో’ పిలుపును విరమించుకోవాలని సూచించిన కేంద్రం.. రైతుసంఘాల నాయకులతో చండీగఢ్‌ వేదికగా సోమవారం దాదాపు అర్ధరాత్రి వరకూ చర్చలు కొనసాగించింది. కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్‌కేఎం (రాజకీయేతర) నేత జగ్జీత్‌సింగ్‌ డల్లేవాల్‌, కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్‌ పంధేర్‌ తదితరులతో సమాలోచనలు జరిపింది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు భరోసా కల్పించేలా చట్టం చేయడం, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, పంటరుణాల మాఫీ, రైతులు-రైతుకూలీలకు పింఛన్లు ఇవ్వడం, మూడు వ్యవసాయ చట్టాలకు (తర్వాత రద్దయ్యాయి) వ్యతిరేకంగా 2020-21లో ఉద్యమించినప్పుడు రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ నడిచింది. వీటిలో.. 2020-21 నాటి కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది. నాటి ఆందోళనల సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాల్లో ఇంకా ఎవరికైనా పరిహారం దక్కకుండా ఉండిఉంటే.. వారికీ పరిహారం అందించేందుకు సమ్మతించింది. ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు నాయకులు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో- మంగళవారం నాటి ‘దిల్లీ చలో’ యథాతథంగా కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సర్వన్‌సింగ్‌ పంధేర్‌ ప్రకటించారు. రైతు నాయకులతో కేంద్రం ఈ నెల 8న కూడా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

  • దిల్లీలోకి నిరసనకారులు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు సింఘు, గాజీపుర్‌, టిక్రీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. రహదారులపై బహుళ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటుచేశారు. పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. 
  • కర్ణాటక నుంచి దిల్లీకి వస్తున్న దాదాపు 100 మంది రైతులను మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్‌కేఎం దక్షిణ భారత కన్వీనర్‌ శాంతకుమార్‌ చెప్పారు. 

ఆంక్షల వలయంలో దిల్లీ

రైతులను అడ్డుకునేందుకు దిల్లీలో పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నివారించేందుకు నగరంలో సోమవారం నుంచి నెల పాటు సెక్షన్‌-144 విధిస్తూ దిల్లీ పోలీసు కమిషనర్‌ సంజయ్‌ అరోడా ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల నిరసనను సంఘ విద్రోహశక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ముప్పుందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకొని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లు, అంతిమయాత్రలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని