గాజా వివాదంపై అమెరికా తీరుకు నిరసన.. పీహెచ్‌డీ డిగ్రీనీ వెనక్కి ఇచ్చేసిన సందీప్‌పాండే

దాదాపు ఆర్నెల్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ - పాలస్తీనా యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గత జనవరిలో రామన్‌ మెగసెసె అవార్డు వదులుకొంటున్నట్లు ప్రకటించిన సామాజిక ఉద్యమకారుడు సందీప్‌పాండే బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి తాను చేసిన పీహెచ్‌డీ డిగ్రీని సైతం తాజాగా వెనక్కు ఇచ్చేశారు.

Published : 27 Mar 2024 05:03 IST

దిల్లీ: దాదాపు ఆర్నెల్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ - పాలస్తీనా యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గత జనవరిలో రామన్‌ మెగసెసె అవార్డు వదులుకొంటున్నట్లు ప్రకటించిన సామాజిక ఉద్యమకారుడు సందీప్‌పాండే బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి తాను చేసిన పీహెచ్‌డీ డిగ్రీని సైతం తాజాగా వెనక్కు ఇచ్చేశారు. అలాగే సిరక్యూజ్‌ యూనివర్సిటీ (న్యూయార్క్‌) నుంచి తాను చేసిన డ్యూయల్‌ ఎమ్మెస్సీ డిగ్రీలను కూడా ఆయన వెనక్కు పంపారు. ఈ మేరకు పై రెండు యూనివర్సిటీలకు విడి విడిగా రాసిన లేఖల్లో గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడి విషయంలో అమెరికా పోషిస్తున్న దారుణమైన పాత్రకు నిరసన తెలుపుతూ తాను ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వివరించారు. ‘‘ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా మధ్యవర్తిత్వ పాత్ర పోషించి, పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా దక్కేలా చూడటం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలదని నేను నమ్మాను. కానీ, దీనికి బదులుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దురాక్రమణకు గుడ్డిగా సైనికపరమైన మద్దతు ఇవ్వడం ద్వారా చిన్నపిల్లలతో సహా వేలమంది అమాయకులు బలయ్యారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు, మానవతా హక్కులకు అమెరికా అండగా నిలుస్తుందని నమ్మడం ఇక కష్టమే అన్నారు. రెండు యూనివర్సిటీల అన్ని రికార్డుల నుంచి తన పేరును తొలగించాలని సందీప్‌పాండే కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని