పేద దేశాలకు టీకా ఇంత ఆలస్యమా: who

ప్రపంచవ్యాప్తంగా ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమై మూడు నెలల గడిచిన తర్వాత.. ఇప్పుడు పేద దేశాలకు టీకా చేరడం విచారకరమని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అంతేకాకుండా గతవారం కరోనా వైరస్‌ కేసుల స్థాయి మళ్లీ పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Published : 02 Mar 2021 10:07 IST

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమై మూడు నెలల గడిచిన తర్వాత.. పేద దేశాలకు టీకా చేరడం విచారకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా గతవారం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. గడిచిన ఏడు వారాల్లో తొలిసారిగా గత వారం కేసుల్లో పెరుగుదల కనిపించినట్లు పేర్కొంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌‌ అధానోమ్‌ జెనీవాలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకు గురిచేసే అంశమన్న ఆయన.. కొవిడ్‌ నిబంధనలను కుదించడమే ఇందుకు కారణంగా చెప్పారు. అంతేకాకుండా ఓవైపు వైరస్‌ వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ.. ప్రజలు జాగ్రత్త చర్యల్ని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని టెడ్రోస్‌‌ చెప్పారు. 

అంతర్జాతీయ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా పేద, మధ్య తరగతి దేశాలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ ఆఫ్రికాలోని రెండు దేశాల్లో సోమవారం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కొవిడ్‌ టీకాలను పేద దేశాలకు ఇవ్వకుండా స్వప్రయోజనాలకు వాడుకొంటున్న ధనిక దేశాల తీరును ఆయన తప్పుబట్టారు. ప్రపంచవ్యాప్తంగా ముప్పు పొంచి ఉన్న వారిని కాపాడటం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన మూడు నెలల తర్వాత పేద దేశాలకు వ్యాక్సిన్‌ చేరడం బాధాకరమైన విషయమన్నారు. 

కాగా.. మే చివరి కల్లా 142 పేద దేశాలకు 23.7 కోట్లు టీకా డోసులను పంపిణీ చేయడానికి సిద్ధం కావచ్చు డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. జాన్‌ హాప్కిన్స్‌ వర్శిటీ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 11.4 కోట్లు కరోనా కేసులు నమోదు కాగా.. 20.5లక్షల మంది మరణించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని