Youtube Channels: మరికొన్ని యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం కొరడా

సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా నకిలీ వార్తలు వ్యాప్తిని అడ్డుకునేలా కేంద్రం కఠిన చర్యలు చేపడుతోంది. విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ప్రసారాలు.....

Updated : 26 Sep 2022 20:14 IST

45 వీడియోలు, 10 యూట్యూబ్‌ ఛానళ్లను బ్లాక్‌ చేసిన ప్రభుత్వం

దిల్లీ: సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేలా కేంద్రం కఠిన చర్యలు చేపడుతోంది. విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ప్రసారాలు చేస్తోన్న పలు యూట్యూబ్‌ ఛానళ్లపై ఇప్పటికే నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో 10 ఛానళ్లపై కొరడా ఝళిపించింది. మత విద్వేషాలను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో నకిలీ వార్తలు, మార్ఫింగ్‌ చేసిన కంటెంట్‌ని ప్రసారం చేస్తోన్న 45 యూట్యూబ్‌ వీడియోలతో పాటు 10 యూట్యూబ్‌ ఛానళ్లను బ్లాక్‌ చేసినట్టు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. బ్లాక్‌ చేసిన వీడియోలకు దాదాపు 1.30కోట్లకు పైగా వీక్షకులు ఉన్నట్టు అధికారిక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

తాజాగా కేంద్రం బ్లాక్‌ చేసిన ఛానళ్లు దేశంలోని పలు వర్గాల మధ్య భయాన్ని రేకెత్తించడంతో పాటు అపోహలను వ్యాప్తి చేసే కంటెంట్‌ను కలిగి ఉన్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ చేసిన కొన్ని వీడియోలు అగ్నిపథ్‌ పథకం, భారత సాయుధ దళాలు, దేశ భద్రత, కశ్మీర్‌కు సంబంధించిన అంశాలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు గుర్తించినట్టు కేంద్రం తెలిపింది. దేశ భద్రత దృష్ట్యా ఈ కంటెంట్‌ని తప్పుడు సమాచారంగా, సున్నితమైనదిగా పరిగణించి వాటిని బ్లాక్‌ చేయాలని ఈ నెల 23న ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్రం పేర్కొంది. ఇంతకుముందు కూడా దేశంలో మత సామరస్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నించేలా ప్రసారాలు చేసిన 102 యూట్యూబ్‌ ఛానళ్లతో పాటు పలు ఫేస్‌బుక్‌ ఖాతాలను కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు