ఓట్ల లెక్కింపు వాయిదాతో ఆకాశమేం విరిగిపడదు

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే, కొవిడ్‌ నేపథ్యంలో కౌంటింగ్‌ విధులకు హాజరు కావావాల్సిన ఉపాధ్యాయులు వెనుకాడుతున్నారు.........

Updated : 01 May 2021 15:55 IST

యూపీ పంచాయతీ ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

దిల్లీ: పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే, కొవిడ్‌ నేపథ్యంలో కౌంటింగ్‌ విధులకు హాజరు కావావాల్సిన ఉపాధ్యాయులు వెనుకాడుతున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై నేడు కోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. ఎట్టకేలకు కొవిడ్‌ నిబంధనల్ని పాటిస్తామన్న ఎన్నికల సంఘం హామీ మేరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.

‘ఓట్ల లెక్కింపు 2-3 వారాలు వాయిదా వేస్తే ఆకాశమేమైనా విరిగిపడుతుందా?’ అంటూ న్యాయస్థానం యూపీ ఎన్నికల సంఘాన్ని ఘాటుగా ప్రశ్నించింది. ‘‘పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ.. ముందుకు వెళ్లదలచుకున్నారా? 2-3 వారాల తర్వాత వైద్య పరిస్థితులు మెరుగయ్యాక లెక్కింపు జరపలేరా? ఇన్ని ఇబ్బందులు ఉన్నా ముందుకు వెళ్లాలనుకుంటున్నారా? మూడు వారాలు వాయిదా వేస్తే ఆకాశమేమీ విరిగిపడదు’’ అంటూ కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం కౌంటింగ్‌ జరిపాలని నిర్ణయించుకున్నామని తేల్చి చెప్పింది.

దీనిపై స్పందించిన కోర్టు.. ఇలాంటి పరిస్థితుల్లో తాము పనిచేయలేమంటూ ఉపాధ్యాయ సంఘాలు పిటిషన్‌ దాఖలు చేసిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితుల్ని ఎలా చక్కబెడతారని ప్రశ్నించింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ సమయంలో కొంత మంది ఉపాధ్యాయులు మరణించారని తెలిపింది. మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనల్ని పకడ్బందీగా అమలు చేస్తామని ఎన్నికల సంఘం వాదనలు ప్రారంభం అయ్యే సమయంలోనే కోర్టుకు తెలిపింది. ఎక్కువ మందిని అనుమతించబోమని.. సిబ్బందికి ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్థాయిలు తనిఖీ చేస్తామని పేర్కొంది. అలాగే కౌంటింగ్‌ కేంద్రాలన్నింటినీ ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తామని తెలిపింది. భౌతిక దూరం పాటిస్తామని స్పష్టం చేసింది. ఇలా కొవిడ్‌ కట్టడికి సంబంధించిన ప్రతి నిబంధనను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఓట్ల లెక్కింపునకు అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని