Rajnath Singh: భారత్ నియంత్రణ రేఖ దాటడానికి సిద్ధంగా ఉంది: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

దేశం కోసం అవసరమైతే మరోసారి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated : 26 Jul 2023 12:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ గౌరవ ప్రతిష్ఠలను కాపాడుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉందని.. ప్రజలు కూడా సైన్యానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పిలుపునిచ్చారు. ఆయన ద్రాస్‌లోని కార్గిల్‌ యద్ధ స్మారకం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నేడు దేశవ్యాప్తంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు.

‘‘మనకు పాకిస్థాన్‌ వెన్నుపోటు పొడిచింది. భారత్‌ యుద్ధం చేయాల్సి వచ్చింది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులకు వందనం చేస్తున్నా. దేశం యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొన్న ప్రతిసారి ప్రజలు పరోక్షంగా మద్దతుగా నిలిచారు. యుద్ధ రంగంలో అవసరమైన చోట సైనికులకు నేరుగా మద్దతు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని నేను కోరుతున్నాను. దేశ గౌరవ ప్రతిష్ఠల కోసం మేము ఎక్కడి వరకైనా వెళ్లేందుకు సిద్ధమే. అవసరమైతే నియంత్రణ రేఖనూ దాటతాం. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని వ్యాఖ్యానించారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులగణన లేదు

సైన్యం సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్నంత సేపు శత్రువులకు ఇటువైపు కన్నెత్తి చూసే ధైర్యం ఉండదని రాజ్‌నాథ్‌ అభివర్ణించారు. కేవలం కార్గిల్‌ యుద్ధంలోనే కాదు.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పలు మార్లు సైన్యం తమ ధైర్య సాహసాలతో దేశం గర్వించేట్లు చేసిందన్నారు.

మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించారు. ‘‘సాయుధ దళాల అసాధారణ ధైర్య సాహసాలను ప్రజలు చిరకాలం గుర్తుంచుకొంటారు. భవిష్యత్తు తరాలకు వారి గాథలు స్ఫూర్తినిస్తాయి’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.  ‘‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌ భారత వీరుల ధైర్యగాథను గుర్తుకు తెస్తుంది. వారు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నేడు చాలా ప్రత్యేకమైన రోజు. వారికి హృదయ పూర్వక నివాళి’’ అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని