Kiren Rijiju: 2025 చివరి కల్లా ‘సముద్రయాన్‌’!: కిరణ్‌ రిజిజు

వచ్చే ఏడాది చివరి నాటికి సముద్రయాన్‌ మిషన్‌ను చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. 

Published : 10 Mar 2024 11:22 IST

దిల్లీ: సముద్ర గర్భ అన్వేషణ కోసం  భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్‌ ఓషన్‌ మిషన్‌ ‘సముద్రయాన్‌’ (Samudrayaan) ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) వెల్లడించారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టం నుంచి ఆరు వేల మీటర్ల లోతులోకి వెళ్లి పరిశోధన చేస్తారని తెలిపారు. ‘‘సముద్రయాన్‌ కోసం ‘మత్య్స’ అనే జలాంతర్గామిని సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా ముగ్గురు శాస్త్రవేత్తల బృందం సముద్ర జలాల్లో ఆరు వేల మీటర్ల లోతులోకి ప్రయాణిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నాయి. 2025 చివరికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం’’ అని మంత్రి తెలిపారు. 

సముద్రజలాల్లోని వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం కోసం 2021లో కేంద్ర ప్రభుత్వం ‘సముద్రయాన్‌’ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. మత్స్య జలాంతర్గామిని చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీలో తయారు చేస్తున్నారు. ఇందులో ఆధునిక సెన్సర్లు, టూల్స్‌ ఉంటాయి. ఇది 12 గంటలపాటు పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో దీని సామర్థ్యాన్ని 96 గంటలకు పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, జపాన్‌ దేశాలు ఈ ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టాయి. సముద్రయాన్‌ విజయవంతంగా చేపట్టడం ద్వారా భారత్‌ ఆ దేశాల సరసన చేరనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని