India massive military exercise: జీ-20 వేళ సరిహద్దుల్లో వాయుసేన గర్జన.. యుద్ధ విన్యాసాలు మొదలు పెట్టిన భారత్‌..!

జీ-20 సదస్సు ప్రారంభ వేళ న్యూదిల్లీ గగనతల రక్షణను సమన్వయం చేసుకొంటూ వాయుసేన చైనా, పాక్‌ సరిహద్దుల్లో త్రిశూల్‌ పేరిట యుద్ధ విన్యాసాలను నేటి నుంచి ప్రారంభించింది.

Published : 04 Sep 2023 13:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీ-20 (G20) సదస్సు మరికొన్ని రోజుల్లో దిల్లీలో ప్రారంభం కానున్న వేళ చైనా(China), పాక్‌ (Pakistan) సరిహద్దుల్లో భారత్‌ (India) దళాలు భారీగా యుద్ధ విన్యాసాలను సోమవారం నుంచి మొదలుపెట్టాయి. వీటిల్లో వాయుసేనకు చెందిన రఫేల్‌ ఫైటర్‌ విమానాలు, ఎస్‌-400, ఎంఆర్‌ఎస్‌ఏఎం, స్పైడర్‌ వంటి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు పాల్గొన్నాయి. దీంతోపాటు ఆర్మీ ప్రత్యేక ఫార్మేషన్స్‌తో డ్రిల్స్‌ చేస్తోంది. త్రిశూల్‌ పేరిట చేపట్టిన ఈ గగనతల యుద్ధ విన్యాసాలను సెప్టెంబర్‌ 4 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తామని రక్షణశాఖ వర్గాలు ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించాయి. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జీ-20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే.

ఈ యుద్ధ విన్యాసాల కోసం పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో వాయుసేన తన ఆయుధాలు, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను మోహరించింది. ఇది న్యూదిల్లీకి భద్రత కల్పించే గగనతల రక్షణ వ్యవస్థతో సమన్వయం చేసుకొంటూ పనిచేస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని చుట్టుపక్కల భారీగా వాయుసేన తన వనరులను మోహరించింది. వీటిల్లో భాగంగా దిల్లీ వద్ద రఫేల్‌, మిరాజ్‌-2000 విమానాలు కాంబాట్‌ ఎయిర్‌ పెట్రోల్స్‌ (సీఏపీ) నిర్వహిస్తున్నాయి. దీనికి తోడు యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ గన్స్‌, ఆకాశ్‌, ఎంఆర్‌ఎస్‌ఏఎంలు మోహరించారు. వీటితోపాటు అవాక్స్‌ వ్యవస్థలు పహారా కాస్తూ గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. కొన్ని కీలక ప్రదేశాల్లో యాంటీడ్రోన్‌ వ్యవస్థలను కూడా సిద్ధం చేశారు. 

ఎలిజబెత్‌-2కు శాశ్వత స్మారకం

ఓ పక్క వాయుసేన త్రిశూల్‌ విన్యాసాలు నిర్వహిస్తుండగా.. మరోవైపు ఆర్మీ లద్దాఖ్‌ ప్రాంతంలో ప్రత్యేకంగా ట్రైనింగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లను నిర్వహిస్తోంది. వీటి కోసం అదనపు బలగాలు ఈ ప్రాంతానికి తరలివచ్చాయి. దీంతోపాటు రొటేషన్‌లో భాగంగా ఇక్కడి నుంచి వెళ్లాల్సిన బలగాలను తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు. వీటిల్లో పర్వత యుద్ధతంత్ర బృందాలు, పారా స్పెషల్‌ కమాండో బృందాలు కూడా ఉన్నాయి. 

ప్రపంచంలోని అగ్రనేతలు హాజరవుతున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు ప్రాంతంలో గగనతల రక్షణ బాధ్యతలను వాయుసేన స్వీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ప్రపంచ నేతలు హాజరయ్యే సదస్సు జరగడం ఇదే తొలిసారి. 1983లో చివరి సారిగా భారత్‌ దాదాపు 70 మంది ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇస్తూ నామ్‌ సదస్సు నిర్వహించింది. ఆ తర్వాత భారీ సదస్సులు ఏమీ జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని