Dornier: దేశ విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం.. పౌర సేవల్లోకి మేడిన్‌ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్‌

భారత విమానయాన చరిత్రలో మరో కొత్త అధ్యాయం. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరవిమానయాన సేవల విస్తరణ దిశగా కీలక అడుగులు. మేడ్ ఇన్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ ‘డోర్నియర్ 228’ను కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ‘అలయన్స్‌ ఎయిర్‌’ మంగళవారం...

Published : 12 Apr 2022 23:58 IST

దిస్పూర్‌: భారత విమానయాన చరిత్రలో మరో కొత్త అధ్యాయం. ఈశాన్య రాష్ట్రాల్లో పౌర విమానయాన సేవల విస్తరణ దిశగా కీలక అడుగులు. మేడిన్‌ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ ‘డోర్నియర్ 228’ను కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ‘అలయన్స్‌ ఎయిర్‌’ మంగళవారం మొట్ట మొదటిసారిగా పౌరవిమానయాన అవసరాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్‌ రిజీజు, సీనియర్ అధికారులు.. జెండా ఊపి ఈ విమాన సేవలను ప్రారంభించారు. అస్సాం డిబ్రూగఢ్‌లోని మోహన్‌పూర్ విమానాశ్రయం నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసిఘాట్‌ వరకు అందులో ప్రయాణించారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి క్రమంలో ఇదొక చారిత్రక అడుగని సింధియా పేర్కొన్నారు. అక్కడి పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాంతీయ విమాన సేవల విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించిన ‘ఉడాన్’ పథకం కింద ‘అలయన్స్‌ ఎయిర్’ సేవలు అందిస్తోంది. పౌర అవసరాల కోసం మేడిన్‌ ఇండియా విమానాన్ని నడిపిన మొట్టమొదటి భారతీయ కమర్షియల్‌ ఎయిర్‌లైన్స్‌గా ఈ సంస్థ అవతరించింది. ఇప్పటి వరకు డోర్నియర్ 228 విమానాలను సాయుధ బలగాలు మాత్రమే ఉపయోగించాయి. పౌరవిమానయాన సేవల కోసం అలయన్స్‌ ఎయిర్‌.. ఫిబ్రవరిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)తో రెండు 17- సీట్ల డోర్నియర్ 228 విమానాల లీజుకు ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి విమానాన్ని ఏప్రిల్ 7న అందుకుంది. ఏప్రిల్‌ 18 నుంచి డిబ్రూగఢ్‌- పాసిఘాట్- లీలాబరి- గువాహటి మార్గంలో రెగ్యులర్ సేవలు ప్రారంభం కానున్నాయి. డిబ్రూగఢ్‌ విమానాశ్రయం కేంద్రంగా.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తేజు, మెచుకా, జిరో, ట్యూటింగ్‌లకూ సేవలు విస్తరించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని