Manipur : మణిపుర్‌ విద్యార్థులారా ఉన్నత విద్య పూర్తి చేయాలనుకుంటే కేరళ వచ్చేయండి!

మణిపుర్‌ (Manipur) విద్యార్థులకు బాసటగా నిలిచేందుకు కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన కన్నూర్‌ యూనివర్సీటీ ముందుకొచ్చింది. ఆసక్తి గల విద్యార్థులు తమను సంప్రదించవచ్చని ఆ విశ్వ విద్యాలయ ఉప కులపతి పేర్కొన్నారు. 

Published : 07 Aug 2023 18:59 IST

తిరువనంతపురం :  మణిపుర్‌ (Manipur) రాష్ట్రంలో ఘర్షణలతో విద్యార్థుల చదువుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎంతో మంది విద్యకు దూరమైపోయారు. ఈ నేపథ్యంలో కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన కన్నూర్‌ యూనివర్సీటీ మణిపుర్‌ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. అండర్‌ గ్రాడుయేట్‌, పోస్ట్ గ్రాడుయేట్ చదవాలనే ఆకాంక్షతో ఉన్న మణిపుర్‌ విద్యార్థులు తమను సంప్రదించాలని విశ్వ విద్యాలయ ఉప కులపతి డాక్టర్‌ గోపీనాథ్‌ రవీంద్రన్ తెలిపారు. మణిపుర్‌ విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ అంశంపై యూనివర్సిటీ సిబ్బందితో చర్చించిన తరువాత ఏకాభిప్రాయానికి వచ్చామని ఆయన వెల్లడించారు.

అవిశ్వాసంపై చర్చకు సిద్ధం.. రాహుల్‌ గాంధీతోనే మొదలు..?

విద్యార్థుల అవసరాలకు తగ్గట్లుగా యూనివర్సిటీ, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో వారికి ప్రవేశం కల్పిస్తామని వీసీ పేర్కొన్నారు. ‘మణిపుర్‌లో విధ్వంసం జరుగుతున్న కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న వారికి యూనివర్సీటీ ప్రత్యేక సీట్లను కేటాయిస్తుంది. వివిధ ప్రోగ్రామ్‌లలో చేరిన వారికి సైతం వసతి కల్పిస్తాం. ప్రవేశం పొందిన విద్యార్థులు వారి విద్యార్హత పత్రాలను సమర్పించడానికి తగినంత సమయం ఇస్తాం. ఫిజికల్ ఎడ్యుకేషన్‌ విభాగంలో ప్రవేశం పొందడానికి మణిపుర్‌ విద్యార్థి ఒకరు ఆసక్తి కనబర్చారని’ వీసీ వివరించారు. 

మణిపుర్‌ విద్యార్థులు తమకు ప్రవేశాలు కల్పించాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలను ఇది వరకే సంప్రదించారని కన్నూర్‌ యూనివర్సీటీ ఉప కులపతి డాక్టర్‌ గోపీనాథ్‌ రవీంద్రన్ తెలిపారు. గత నెలలో మణిపుర్‌ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు తిరువనంతపురంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతిలో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ చర్య తరువాతే మణిపుర్‌ విద్యార్థులు తనతో సంప్రదింపులు చేయడానికి ముందుకు వచ్చారని వీసీ వివరించారు. ఇలాంటి మంచి పనులతో కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని