Vijayakanth: రాజకీయాల్లోనూ ఆయన కెప్టెన్‌ : విజయకాంత్‌ను కొనియాడిన మోదీ

ప్రధాని మోదీ(Modi) ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్‌ విజయకాంత్‌కు నివాళి సమర్పించారు. 

Updated : 02 Jan 2024 17:33 IST

చెన్నై: ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(PM Modi)..‘దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (DMDK)’ పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్‌(71)(Vijayakanth)కు నివాళి అర్పించారు. ఆయన సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తన ప్రభావం చూపి, కెప్టెన్‌ అనిపించుకున్నారని కొనియాడారు.

‘కొద్ది రోజులక్రితం తిరు విజయకాంత్‌జీ(Vijayakanth) మనకు దూరమయ్యారు. ఆయన సినిమా ప్రపంచంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా కెప్టెన్‌ అనిపించుకున్నారు. తన సినిమాల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఒక రాజకీయవేత్తగా దేశ ప్రయోజనాలకే అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు’ అని మోదీ అన్నారు. అలాగే ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

‘ రాజకీయాల్లో ఆశాదీపంగా కనిపించి.. దిగ్గజ నేతలకు సవాలుగా నిలిచి!’

రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మోదీ తమిళనాడు(Tamil Nadu) చేరుకున్నారు. తిరుచ్చిరాపల్లిలోని భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకుంటూ యువత ముందుకుసాగాలని సూచించారు.  ఈ సందర్భంగానే విజయకాంత్‌(Vijayakanth)కు నివాళులర్పించారు. డిసెంబర్ 28న కెప్టెన్‌ తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.

విజయకాంత్ తమిళరాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 2011లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకొని.. డీఎంకేను గద్దె దించడంలో కీలకపాత్ర పోషించారు. 41 స్థానాల్లో పోటీ చేసిన విజయకాంత్‌ పార్టీ ఏకంగా 29 స్థానాల్లో విజయం సాధించి (7.8 శాతం ఓట్లు) రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే మూడో స్థానానికే పరిమితమయ్యింది. అలా తమిళ రాజకీయాల్లో నిర్ణయాత్మకశక్తిగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని