మహారాష్ట్ర సీఎంపై కంగన ఘాటు వ్యాఖ్యలు

ముంబయిలోని తన కార్యాలయాన్ని కూల్చేయడంపై నటి కంగనా రనౌత్‌..

Updated : 28 Nov 2023 16:30 IST

‘ఈ రోజు నా ఇల్లు.. రేపు మీ అహంకారం’

ముంబయి: ముంబయిలోని తన కార్యాలయాన్ని కూల్చేయడంపై నటి కంగనా రనౌత్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూవీ మాఫియాతో జట్టుకట్టి తనపై పగ తీర్చుకుంటున్నారని ఆరోపించారు. ‘ఉద్ధవ్‌ ఠాక్రే.. మీకేమనిపిస్తోంది? మూవీ మాఫియాతో కలిసిపోయారు. నా ఇంటిని కూల్చి నా మీద పగ తీర్చుకున్నారని మీరు అనుకుంటున్నారు కదా? ఈ రోజు నా ఇంటిని కూల్చిశారు. రేపు మీ అహంకారం అలానే కూలిపోతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిత్యం పరిగెడుతూనే ఉంటుందనేది గుర్తుంచుకోండి’’ అని కంగన అన్నారు. తన కార్యాలయాన్ని బీఎంసీ కూల్చివేసిన కొద్ది గంటలకే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యపైనే కాదు, కశ్మీరీ పండిట్లపైనా సినిమా తీస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. వారు ఎన్ని బాధలు అనుభవించారో ఇప్పుడు అర్థమైందని చెప్పారు.

ముంబయిలోని పాలీ హిల్స్‌లో ఉన్న కంగనా రనౌత్‌ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారంటూ బీఎంసీ ఈరోజు ఉదయం కూల్చివేత ప్రారంభించింది. ఈ విషయంపై నటి హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతలు ఆపేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. నటుడు సుశాంత్‌ సింగ్‌ కేసు దర్యాప్తులో ముంబయి పోలీసుల నిర్లక్ష్యం చేస్తున్నారని, ముంబయి మినీ పీవోకేలా మారిందంటూ కంగన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన నేతలు, కంగన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రాణహాని ఉందని కేంద్రం కంగనాకు ‘వై ప్లస్‌’ సెక్యూరిటీని కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని