Ayodhya: ఆహ్వానం అందలేదు.. అవమానిస్తున్నారు..! అఖిలేశ్‌ యాదవ్‌

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించి తనకు ఇంకా ఆహ్వానం అందలేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్ తెలిపారు.

Published : 12 Jan 2024 18:03 IST

లఖ్‌నవూ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాని (Ram temple Consecration)కి ముహూర్తం సమీపిస్తోంది. ఇప్పటికే ఆలయ వర్గాలు ప్రముఖులకు ఆహ్వానపత్రాలు అందజేస్తున్నాయి. ఈ వేడుకకు సంబంధించి ఇంకా తనకు ఆహ్వానం అందలేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్ (Akhilesh Yadav) శుక్రవారం తెలిపారు. కొరియర్‌ రూపంలోనూ పత్రిక పంపలేదన్నారు. ఒకవేళ అదే నిజమైతే.. ఆధారాలు చూపెట్టాలని డిమాండ్‌ చేశారు.

‘‘సంబంధిత వర్గాలు నన్ను అవమానిస్తున్నాయి. నాకు ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. మనమేదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు తెలిసిన వారిని మాత్రమే పిలుస్తాం. అపరిచితులను ఆహ్వానించం’’ అని పార్టీ కార్యాలయంలో అఖిలేశ్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. కొరియర్‌ ద్వారా ఆహ్వాన పత్రాన్ని పంపినట్లు తెలిసిందని ఓ విలేకరి పేర్కొనగా.. సరైన చిరునామాకు పంపారో? లేదో? తెలుసుకునేందుకు రశీదును తనకు చూపించాలన్నారు.

‘11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం’ పాటించనున్న మోదీ

ఈ వ్యవహారంపై విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్‌ స్పందించారు. ‘‘అఖిలేశ్‌ యాదవ్‌కు ఆహ్వానం అందిందో.. లేదో.. ధ్రువీకరించలేను. కానీ, ఆహ్వానితుల జాబితాలో ఆయన పేరూ ఉంది’’ అని తెలిపారు. అయోధ్యలో ఈనెల 22న జరిగే శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌రంజన్‌ చౌధరిలు నిర్ణయించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని