Vaccination Drive: ఏడాది ప్రయాణం.. ఎన్నెన్నో మైలురాళ్లు!

కొత్త వైరస్‌.. ఫలితంగా భారీ సంఖ్యలో కేసులు.. ఊహించని స్థాయిలో మరణాలు.. దాదాపు 130 కోట్లకుపైగా జనాభా కలిగిన భారతావనిలో కరోనా కట్టడి సాధ్యమేనా అన్న సందిగ్ధత! ఇలాంటి పరిస్థితుల నడుమ.. గతేడాది ఇదే రోజు దేశంలో ప్రారంభమైంది వ్యాక్సినేషన్‌ ప్రక్రియ...

Published : 16 Jan 2022 12:08 IST

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమై నేటికి సంవత్సరం పూర్తి

దిల్లీ: కొత్త వైరస్‌.. ఫలితంగా భారీ సంఖ్యలో కేసులు.. ఊహించని స్థాయిలో మరణాలు.. దాదాపు 130 కోట్లకుపైగా జనాభా కలిగిన భారతావనిలో కరోనా కట్టడి సాధ్యమేనా..? అన్న సందిగ్ధత! ఇలాంటి పరిస్థితుల నడుమ.. గతేడాది ఇదే రోజు దేశంలో ప్రారంభమైంది వ్యాక్సినేషన్‌ ప్రక్రియ. ఏడాది తిరిగేసరికి దేశవ్యాప్తంగా దాదాపు 156 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేయడం విశేషం. ప్రజలను కరోనా ముప్పు నుంచి కాపాడటంలో వ్యాక్సిన్‌లది కీలక పాత్ర అని చెబుతూ వస్తోన్న డబ్ల్యూహెచ్‌వో, ఇతర వైద్య నిపుణుల సూచనలతో.. తొలుత మందకొడిగా సాగిన ఈ టీకా ప్రక్రియ రెండో వేవ్‌ అనంతరం ఒక్కసారిగా దూసుకెళ్లిన విషయం తెలిసిందే. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ ప్రధాన టీకాలుగా.. ఆరోగ్య సిబ్బంది జనాలను చైతన్య పరుస్తూ మారుమూల ప్రాంతాలకు వెళ్లీ పంపిణీ చేశారు. తొలుత వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో మొదలైన ఈ కార్యక్రమం.. ప్రస్తుతం 15 ఏళ్లనుంచి ఆపైబడిన వారికి కొనసాగుతోంది.

ఈ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పందిస్తూ.. ఈ రోజుతో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమానికి ఏడాది పూర్తయిందని హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాం అని కొనియాడారు. ఈ క్రమంలోనే ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి, స్ఫూర్తిదాయక నాయకత్వంతో ఇది సాధ్యపడిందని ట్వీట్‌ చేశారు.

దేశంలో వ్యాక్సినేషన్‌ మైలురాళ్లు..

* జనవరి 2: కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లకు భారత్‌లో వినియోగానికి అత్యవసర అనుమతుల జారీ

* జనవరి 16: వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలు

* ఫిబ్రవరి 19: కోటి డోసుల పంపిణీ

* మార్చి 1: వ్యాక్సిన్‌కు కొవిన్‌, ఆరోగ్య సేతు, ఉమంగ్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్లు షురూ

* ఏప్రిల్‌ 1: 10 కోట్ల డోసుల మైలురాయి

* ఆగస్టు 6: 50 కోట్ల డోసుల పంపిణీ

* సెప్టెంబరు 17: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఒకే రోజు 2.5 కోట్లకు పైగా డోసుల అందజేత

* అక్టోబరు 21: వంద కోట్ల డోసుల రికార్డు

* జనవరి 3: 15-18 ఏళ్లలోపువారికి వ్యాక్సిన్‌ల పంపిణీ మొదలు

* జనవరి 7: 150 కోట్ల డోసుల ఘనత

* జనవరి 10: ప్రికాషన్‌ డోసుల పంపిణీ ప్రారంభం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని