Cauvery: కావేరి జల వివాద పరిష్కారం.. మోదీతోనే సాధ్యం: దేవెగౌడ

Cauvery water Issue| కావేరి జల వివాదానికి ప్రధాని మోదీ వల్లే పరిష్కారం దొరుకుతుందని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు.

Published : 13 Jan 2024 20:38 IST

బెంగళూరు: నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి ప్రధాని అవుతారని, ఆయనతోనే కావేరి జలాల సమస్య పరిష్కారమవుతుందని మాజీ ప్రధాని హెచ్‌.డి దేవెగౌడ (H.D Deve Gowda) అన్నారు. ఈ విషయంలో తుదిశ్వాస వరకు న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. బెంగళూరులోని (Bengaluru) పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కర్ణాటక ఎదుర్కొంటున్న కావేరీ జలాల సమస్యను (Cauvery water Issue) ఒక కొలిక్కి తెచ్చే శక్తి మోదీకి మాత్రమే ఉందన్నారు. నీటి కోసం ప్రతి ఏటా కావేరి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (సీడబ్ల్యూఎమ్‌ఏ)కి తమిళనాడు లేఖ రాయడం.. వెంటనే జలాలు విడుదల చేయాలని ఆదేశించడం రివాజుగా మారిపోయిందని విమర్శించారు. 

కావేరి రిజర్వాయర్లలో నీటి లభ్యత తెలుసుకోకుండానే సీడబ్ల్యూఎమ్‌ఏ ఆదేశాలిస్తోందని, వాస్తవాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో ఒక్కసారి కూడా పర్యటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మోదీకి సమస్య వివరిస్తే.. కచ్చితంగా పరిష్కారం దొరుకుతుందన్నారు. మరో రెండున్నరేళ్ల పాటు రాజ్యసభలో ఉంటానని, ప్రతి సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు. ప్రాణం పోయే వరకు కావేరి జలాల కోసం పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. ఫిబ్రవరి నెలలో పార్లమెంట్‌ సమావేశాలకు దిల్లీ వెళ్లినప్పుడు ప్రధానిని కలిసి దీనిపై చర్చిస్తానని మీడియాకు తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను

వయో సమస్యల వల్ల రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని దేవెగౌడ ప్రకటించారు. కానీ, జేడీఎస్‌ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. తన శక్తిమేరకు పార్టీ కోసం శ్రమిస్తానన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌.డి. కుమారస్వామి బరిలో దిగుతున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదని, మోదీ సూచనల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని