Lok Sabha polls: ఎన్నికల విధుల్లో 3.4 లక్షల కేంద్ర బలగాలు.. బెంగాల్‌లోనే 92 వేల మంది!

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల పోలీసు సిబ్బందితోపాటు దేశవ్యాప్తంగా మొత్తంగా 3.4లక్షల మంది కేంద్ర బలగాలను ఈసీ రంగంలోకి దించనుంది.

Published : 16 Mar 2024 22:36 IST

దిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) నగారా మోగింది. మొత్తంగా ఏడు దశల్లో లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ (Election Commission) సిద్ధమైంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, భారీ స్థాయిలో భద్రతను కల్పించనుంది. రాష్ట్రాల పోలీసు సిబ్బందితోపాటు మొత్తంగా 3.4లక్షల మంది కేంద్ర బలగాలను రంగంలోకి దించనుంది.

ఎన్నికల భద్రత కోసం దాదాపు మూడున్నర లక్షల మంది సిబ్బందిని మోహరిస్తుండగా.. ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే 92వేల మంది (920 కంపెనీలు) కేంద్ర సాయుధ పోలీసుల బలగాలు (CAPFs) విధులు నిర్వర్తించనున్నాయి. ఇక్కడ ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. ఉగ్రవాద చర్యల ముప్పు ఉన్న జమ్మూ కశ్మీర్‌లో 63,500మంది భద్రతా సిబ్బంది, నక్సలైట్లు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో 36వేల మందిని మోహరించనున్నారు.

LS polls: ఎన్నికల నియమావళి.. తొలి ‘కోడ్‌’ కూసింది అప్పుడే!

బిహార్‌లో 29,500, యూపీలో 25,200, ఆంధ్రప్రదేశ్‌లో 25,000 మంది కేంద్ర బలగాలను ఎన్నికల విధులకు కేటాయించనున్నారు. పలు రాష్ట్రాల్లో సున్నితమైన ప్రాంతాలను గుర్తించి, ముందస్తుగానే అక్కడ 2వేల కంపెనీలను దించడం మొదలుపెట్టారు. ఎన్నికల విధుల్లో భాగంగా.. స్థానికంగా కవాతు నిర్వహించి ఓటర్లలో విశ్వాసం పెంపొందించడం, ఈవీఎంలు, స్ట్రాంగ్‌ రూమ్‌లకు భద్రత, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తారు.

ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారుల నుంచి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని అన్ని రాష్ట్రాల్లో 3,400 కంపెనీల కేంద్ర బలగాలను (CAPFs) రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. అయితే, సీఏపీఎఫ్ ఒక్కో కంపెనీలో 100 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎన్‌ఎస్‌జీలు.. సీఏపీఎఫ్‌ కిందకే వస్తాయి. మొత్తంగా వీటన్నింటిలో 10లక్షల మంది సిబ్బంది ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని