LS Polls: ‘సార్వత్రిక’ విజయం.. అందనంత దూరం.. 99% స్వతంత్రుల డిపాజిట్లు గల్లంతు

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఓటర్ల మద్దతు అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. 1951లో ఆరు శాతం, 1957లో ఎనిమిది శాతంగా ఉన్న వారి విజయాలు.. 2019 నాటికి 0.11 శాతానికి పడిపోయాయి.

Published : 04 Apr 2024 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు భారత్‌ సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న తొలివిడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. అయితే.. దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే స్వతంత్ర అభ్యర్థుల (Independent Candidates)కు ఓటర్ల మద్దతు అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్రులుగా పోటీ చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. 1951లో ఆరు శాతం, 1957లో ఎనిమిది శాతంగా ఉన్న వారి విజయాలు.. 2019 నాటికి 0.11 శాతానికి పడిపోయాయి. 1991 ఎన్నికల నాటి నుంచి ఏకంగా 99 శాతానికిపైగా ఇండిపెండెంట్‌లు డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం.

సొంతవాళ్లే ఓటెయ్యలేదు.. ఒక్క ఓటుతో ఓడిపోయారు..!

  • 1951-52 తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 533 మంది స్వతంత్రులు పోటీ పడ్డారు. అయితే.. వారిలో కేవలం 37 మంది మాత్రమే విజయం సాధించారు. 1957లో 1519 మంది బరిలో దిగగా.. 42 మంది మాత్రమే గెలిచారు. ఈ రెండు ఎన్నికల్లోనూ 67 శాతం మంది ఇండిపెండెంట్లు తమ డిపాజిట్‌ కోల్పోయారు.
  • 1962లో స్వతంత్రుల్లో 20 మంది (4.2 శాతం) గెలుపొందారు. 78 శాతానికి పైగా పోటీదారుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం నిర్వహించిన 1984 ఎన్నికల్లో 13 మంది (0.30 శాతం మంది) విజయం సాధించగా.. 96 శాతానికిపైగా ఇండిపెండెంట్లకు ధరావత్తు దక్కలేదు.

2019లో నలుగురే..

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది వేలమందికి పైగా స్వతంత్రులు పోటీ చేయగా.. కేవలం నలుగురు మాత్రమే గెలుపుతీరాలకు చేరారు. 99.6 శాతం మంది డిపాజిట్‌ కోల్పోయారు. గెలిచిన నలుగురిలో సుమలత అంబరీష్‌ (మండ్య, కర్ణాటక), నవనీత్‌ రాణా (అమరావతి, మహారాష్ట్ర), నభకుమార్‌ సరానియా (కోక్రాఝార్‌, అస్సాం), మోహన్‌భాయ్‌ డేల్కర్‌ (దాద్రానగర్‌ హవేలీ) ఉన్నారు. 2021లో డేల్కర్‌ మృతి చెందగా.. ఆయన సతీమణి ప్రస్తుతం శివసేన (యూబీటీ) నుంచి ఎంపీగా ఉన్నారు.

ఎందుకీ పరిస్థితి...?

ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల గెలుపు ధోరణిని పరిశీలిస్తే వారిపై ఓటర్లు విశ్వాసం చూపడం లేదని తెలుస్తోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ‘‘ఇండిపెండెంట్‌గా పోటీ చేసేవారు కొన్నిసార్లు పార్టీల నుంచి టికెట్‌ ఆశించి, భంగపడిన వారు ఉంటారు. ఓట్లను చీల్చేందుకూ పోటీ చేస్తుంటారు. ఒకవేళ గెలిస్తే బేరసారాలు చేయొచ్చన్న ఆశతో మరికొందరు ప్రయత్నిస్తారు. అయితే.. హామీలు నెరవేర్చడం పార్టీలతోనే సాధ్యమని ఓటర్లు భావిస్తున్నారు’’ అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) అధిపతి మేజర్ జనరల్ అనిల్ వర్మ (రిటైర్డ్) తెలిపారు. అభ్యర్థుల విషయంలో ఓటర్లలో అవగాహన మరింత పెరిగిందని, తమ వాగ్దానాలను నెరవేర్చగలవారు ఎవరో గుర్తించగలుగుతున్నారని ‘యాక్సిస్ ఇండియా’ సంస్థ ఛైర్మన్ ప్రదీప్ గుప్తా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని