ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ సురక్షితం, విజయవంతం

 కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ విజయవంతంగా పనిచేస్తోందని తెలిసింది. ప్రయోగాల్లో ఈ సూది మందును తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి చైతన్యమైందని శాస్త్రవేత్తలు ...

Updated : 21 Jul 2020 09:32 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ విజయవంతంగా పనిచేస్తోందని తెలిసింది. ప్రయోగాల్లో ఈ సూది మందును తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి చైతన్యమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది వారికి ఎలాంటి హాని కలిగించలేదని లాన్సెట్‌ సైన్స్ ‌జర్నల్‌ ఎడిటర్‌ రిచర్డ్‌ హోర్టన్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ సురక్షితమని, తీసుకున్నవారికి సహించిందని ఆయన పేర్కొన్నారు.

‘ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ 1/2 దశల ప్రయోగ ఫలితాలు ఇప్పుడు ప్రచురించాం. వ్యాక్సిన్‌ సురక్షితం. చక్కగా సహిస్తోంది. రోగనిరోధక శక్తిని చైతన్యం చేసింది. రూపకర్తలైన పెడ్రో ఫొల్‌గట్టి, సహచరులకు అభినందనలు. ఈ ఫలితాలు ఆశాజనంగా ఉన్నాయి’ అని రిచర్డ్‌‌ ట్వీట్‌ చేశారు. చింపాంజీల్లో జలుబుకు కారణమయ్యే వైరస్‌ను సేకరించి దానిలో జన్యుపరంగా  మార్పులు చేసి ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నిర్వహించిన ప్రయోగాల్లో 1,077 మంది పాల్గొన్నారు. అందరిలోనూ యాంటీబాడీలు, టి-కణాలు విడుదల అయ్యాయి. అయితే కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు ఈ స్థాయి సరిపోతుందా లేదా తెలుసుకొనేందుకు భారీస్థాయిలో ప్రయోగాలు అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టీకా తీసుకున్న 14 రోజులకు టి-కణాల, 28 రోజులకు యాంటీబాడీలు తీవ్ర దశ (పీక్‌)కు చేరుకున్నాయి. 90% మందిలో ఒక డోస్‌కే యాంటీబాడీలు అభివృద్ధి చెందగా 10% మందికి మాత్రమే రెండో డోస్‌ అవసరమైంది.

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ సురక్షితమని తెలుస్తోంది. భారీ దుష్ప్రభావాలేమీ కనిపించలేదు. అయితే 70% మందికి స్వల్పంగా జ్వరం లేదా తలనొప్పి వచ్చింది. కొద్ది మందిలో తిమ్మిర్లు, అలసట, వికారం వంటి లక్షణాలు కనిపించాయి. అయితే పారాసిటమాల్‌తో ఇవన్నీ తగ్గిపోయాయి. టీకా‌ పూర్తి పనితీరును తెలుసుకొనేందుకు తర్వాతి దశలో బ్రిటన్‌లో 10వేలు, అమెరికాలో 30వేలు, దక్షిణాఫ్రికాలో 2000, బ్రెజిల్‌లో 5000 మందిపై ప్రయోగాలు చేయనున్నారు. ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని