Padma awards: బిపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌.. కృష్ణ ఎల్ల దంపతులకు పద్మభూషణ్‌

పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పద్మ’ అవార్డుల .....

Updated : 25 Jan 2022 22:06 IST

దిల్లీ: పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పద్మ’ అవార్డుల జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గానూ నలుగురికి పద్మవిభూషణ్‌, 17మందికి పద్మభూషణ్‌, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌సింగ్‌ (మరణానంతరం)లకు పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.

కొవిడ్‌ మహమ్మారి పోరాటంలో కీలక అస్త్రమైన కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులను పద్మభూషణ్‌ పురస్కారం వరించింది. అలాగే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో పాటు పశ్చిమబెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య, కొవిషీల్డ్‌ టీకా తయారు చేసిన సీరమ్‌ సంస్థ ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా, ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది.

తెలుగు ‘పద్మ’లు వీరే..
తెలుగు రాష్ట్రాలను ఈసారి మొత్తంగా ఏడు పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి నలుగురికి, ఏపీ నుంచి ముగ్గురికి ఈ అవార్డులు దక్కాయి. భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు (సంయుక్తంగా) పద్మ భూషణ్‌ పురస్కారానికి ఎంపిక కాగా.. పద్మశ్రీ పురస్కారాలకు ఆరుగురు ఎంపికయ్యారు. వీరిలో ఏపీకి చెందినవారు ముగ్గురు ఉండగా.. తెలంగాణ నుంచి ముగ్గురు ఉన్నారు. ఏపీ నుంచి గోసవీడు షేక్‌ హసన్ ‌(కళారంగం‌); డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణరావు (వైద్యం‌); గరికపాటి నరసింహారావు ఉండగా..  తెలంగాణ నుంచి మొగులయ్య (కళలు‌), రామచంద్రయ్య (కళలు),  పద్మజారెడ్డి (కళలు) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.   

‘పద్మ’ పురస్కారాలు -2022 పూర్తి జాబితా ఇదీ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు