PM Modi : ‘ఆ ప్రదేశాలకు మీరు తప్పక వెళ్లాలి’.. అమితాబ్‌ బచ్చన్‌ ట్వీట్‌కు ప్రధాని మోదీ రిప్లై

ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌ పర్యటనపై బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఆసక్తికర ట్వీట్ చేశారు. దీనికి ప్రధాని బదులిస్తూ.. అమితాబ్‌ను రెండు ప్రాంతాల పర్యటనకు వెళ్లాలని కోరారు.

Published : 15 Oct 2023 18:37 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మూడు రోజుల క్రితం ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో పర్యటించారు. ఇందులో భాగంగా ప్రధాని రాష్ట్రంలోని పలు పుణ్య క్షేత్రాలను సందర్శించారు. అంతేకాకుండా, ఉత్తరాఖండ్‌లో ఆయన తరచూ సందర్శించే పవిత్ర క్షేత్రాల జాబితాను షేర్‌ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలనైనా కచ్చితంగా సందర్శించాలని పౌరులను కోరారు. దానికి సంబంధించిన ఫొటోలను ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)లో షేర్‌ చేశారు. తాజాగా ప్రధాని పర్యటనపై బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) స్పందించారు. ‘‘కైలాస పర్వతాలకు ఉన్న పవిత్రత, వాటి రహస్యం, దివ్యత్వం.. చాలా కాలంగా నన్ను ప్రేరేపిస్తున్నాయి. కానీ, వాస్తవం ఏంటంటే వ్యక్తిగతంగా నేను వాటిని సందర్శించలేను’’ అని అమితాబ్‌ బచ్చన్‌ ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. అమితాబ్‌ తప్పకుండా కైలాస పర్వతాన్ని సందర్శించాలని కోరారు. అలాగే, గతంలో వెళ్తానని చెప్పి.. ఇప్పటికి ఓ ప్రదేశాన్ని అమితాబ్‌ సందర్శించలేదని ప్రధాని గుర్తు చేశారు. ‘‘పార్వతీ కుండ్, జగేశ్వర్‌ ఆలయాల దర్శనం నన్ను మంత్రముగ్ధుణ్ని చేసింది. మరి కొద్దిరోజుల్లో కచ్‌లో ఉత్సవ్‌ ప్రారంభం అవుతుంది. మీరు తప్పకుండా వెళ్లాలని నేను కోరుతున్నాను. అలాగే, ఇంకా మీరు స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ (ఐక్యతా మూర్తి) సందర్శనకు కూడా వెళ్లలేదు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి మధ్య జరిగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని