Sharad Pawar: మోదీజీ.. అవినీతి ఎన్సీపీ నేతలను శిక్షించండి మరి: శరద్‌ పవార్‌

Sharad Pawar on Modi: ఎన్సీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని శరద్‌ పవార్‌ డిమాండ్‌ చేశారు.

Published : 08 Jul 2023 20:08 IST

ముంబయి: అవినీతికి పాల్పడిన నేషనలిస్ట్‌ కాంగ్రస్‌ పార్టీ (NCP) నేతలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని మహారాష్ట్ర సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) డిమాండ్‌ చేశారు. ఎన్సీపీ నేతలపై మోదీనే స్వయంగా అవినీతి ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆయన చేతుల్లోనే ఉన్నందున సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు నాసిక్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఎన్సీపీలో చీలిక తెచ్చి అజిత్‌ పవార్‌. ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీని తిరిగి నిర్మిస్తానని శరద్‌ పవార్‌ శపథం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టారు. తిరుగుబాటు నేత ఛగన్‌ భుజ్‌బల్‌ సొంత నియోజకవర్గమైన యోలా నియోజకవర్గంలో బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘భోపాల్‌లో భాజపా బూత్‌ స్థాయి వర్కర్ల సమావేశంలో ప్రధాని మోదీ ఎన్సీపీ నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు. రూ.70 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరుతున్నా’’ అంటూ అజిత్‌ పవార్‌ వర్గాన్ని ఉద్దేశించి శరద్‌ పవార్‌ అన్నారు.

 

తన వయసు గురించి ఇంకోసారి ఎవరూ మాట్లాడొద్దని శరద్‌ పవార్‌ హెచ్చరించారు. పార్టీ కార్యకర్తల కోసం చివరి వరకు పని చేస్తానని చెప్పారు. కొందర్ని నమ్మి తాను తీవ్రంగా మోసపోయానంటూ భుజ్‌బల్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. మరోసారి ఈ తప్పు జరగకుండా చూసుకుంటానని, చేసిన తప్పునకు లెంపలేసుకోవడానికే ఇక్కడికి వచ్చానని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. మరోవైపు యోలా సభ నేపథ్యంలో శరద్‌ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియ సూలె వర్షంలో తడిసిన తండ్రి ఫొటోను పంచకున్నారు. ‘కొందరు పారిపోయినప్పటికీ.. యుద్ధంలో అలసిపోకుండా దృఢంగా నిల్చున్నారు చూడండి’ అంటూ ఓ వ్యాఖ్యను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని