PM Modi: నేను అలాంటి నేతను కాను: ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

Updated : 10 Mar 2024 18:28 IST

లఖ్‌నవూ: ఎన్నికల సమయంలో ఓటర్లను నమ్మించేందుకు గత ప్రభుత్వాలు తప్పుడు హామీలు ఇచ్చి ఆ తర్వాత కనిపించకుండా పోయేవని ప్రధాని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. తాను మాత్రం అటువంటి నేతను కాదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

‘‘35 ఏళ్ల క్రితం చేసిన వాగ్దానాలను ఇప్పటికీ నెరవేర్చలేకపోయారు. గత ప్రభుత్వాల్లో కొందరు నేతలు ప్రజలను మోసం చేసేందుకు హామీలు ఇచ్చేవారు. ఫలితాల అనంతరం వారితో పాటు హామీలు కూడా కనుమరుగయ్యాయి. అలాంటి జాబితాలో నన్ను కూడా చేర్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, నేను అలాంటి నాయకుడిని కాదు. మోదీ ఎప్పుడూ భిన్నమైన వ్యక్తి’’ అని అభివర్ణించుకున్నారు.

దేశాభివృద్ధి కోసమే నా ప్రయాణం..

‘‘అభివృద్ధి కోసం 2019లో మా ప్రభుత్వం వేసిన పునాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసింది కాదు. ఆ ప్రాజెక్టులను నేడు ప్రారంభించాం. నా ప్రయాణం కేవలం దేశ అభివృద్ధి కోసమే. 2047 నాటికి దేశాన్ని ‘వికసిత్‌ భారత్‌’గా మార్చాలనే సంకల్పంతో పని చేస్తున్నా’’ అని మోదీ పేర్కొన్నారు. యూపీలో రూ. 34,700 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటిలో 16 విమానాశ్రయాలు, బహుళ అభివృద్ధి ప్రాజెక్టులున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్‌, భాజపా నేతలతో కలిసి అజంగఢ్‌లోని మండూరిలో మోదీ పర్యటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని