లోక్‌సభ ఎన్నికల వేళ.. మార్చి 3న కేంద్ర మంత్రిమండలి భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో మార్చి 3న కేంద్ర మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Published : 21 Feb 2024 19:00 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) సంబంధించి మార్చి రెండో వారంలో షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో మార్చి 3న కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది. దిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్‌ భవన్‌లో ఈ భేటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందే కేంద్ర మంత్రిమండలి భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పర్యటించి.. ఎన్నికల సంసిద్ధతను పర్యవేక్షిస్తోంది. మరోవైపు, 2014 లోక్‌సభ ఎన్నికలను తొమ్మిది విడతల్లో నిర్వహించారు. మార్చి 5న ఎన్నికల ప్రక్రియ మొదలై మే 16న ఫలితాలు వెలువడ్డాయి. 2019లో మాత్రం ఏడు విడతల్లో నిర్వహించారు. మార్చి 10న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా మే 23న ఫలితాలు వచ్చాయి.

ఈక్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ మార్చి 9 తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం శాసనసభలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సిఉంది. వీటితోపాటు జమ్మూకశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని