Resort murder: వారికి ఉరిశిక్ష పడేలా చూస్తాం..! ఉత్తరాఖండ్‌ డీజీపీ హామీ

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ఓ యువతి శవమై తేలిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే భాజపా(BJP) నేత వినోద్‌ ఆర్య కుమారుడు, రిసార్టు యజమాని పులకిత్‌...

Published : 26 Sep 2022 02:02 IST

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ఓ యువతి శవమై తేలిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే భాజపా(BJP) నేత వినోద్‌ ఆర్య కుమారుడు, రిసార్టు యజమాని పులకిత్‌ ఆర్యతోపాటు అతడి సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు యువతి.. రిసార్టుకు వచ్చే అతిథులకు ‘ప్రత్యేక’ సేవలు అందించేందుకు నిరాకరించడం వల్లే వారు ఈ హత్యకు పాల్పడినట్లు  డీజీపీ(DGP) అశోక్‌ కుమార్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై డీజీపీ మరోసారి మాట్లాడుతూ.. ఈ ఘటనలో నిందితులకు ఉరి శిక్ష పడేలా తగిన సాక్ష్యాలను కోర్టులో సమర్పిస్తామని మృతురాలి తండ్రికి హామీ ఇచ్చినట్లు చెప్పారు.

‘బాధితురాలి తండ్రితో ఫోన్‌లో మాట్లాడా. ఆమె హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. దోషులకు కఠిన శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చా. వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం’ అని డీజీపీ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్న ‘సిట్(SIT)’‌.. దోషులకు ఉరిశిక్ష పడేలా కోర్టులో సమర్పించేందుకు అన్ని సాక్ష్యాలను సేకరిస్తోందని వ్యక్తిగతంగా హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. యువతి పనిచేసే రిసార్టు భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆధారాలను నాశనం చేసేందుకే ఇలా చేశారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అయితే, అదనపు ఎస్పీ కోట్‌ద్వార్ శేఖర్ చంద్ర సుయల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎలాంటి సాక్ష్యాలను ధ్వంసం చేయలేదని పేర్కొన్నారు. ‘ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలను ధ్వంసం చేయలేదు. రిసార్ట్‌లోని  బాధితురాలి గదిని మా బృందం వీడియో తీసింది. ఫోరెన్సిక్, శాస్త్రీయ ఆధారాలు కూడా సేకరించాం. నిందితులే దోషులని నిరూపించేందుకు మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి’ అని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి సైతం ఇప్పటికే హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని