Gandhi Jayanti: మహాత్ముడికి నేతల ఘన నివాళి.. ఆదర్శమూర్తి అడుగుజాడల్లో నడవాలని పిలుపు

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు కీలక నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు. అహింసామార్గంలో నడుస్తూ శాంతిస్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Updated : 02 Oct 2022 15:22 IST

దిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విలువలైన శాంతి, సమానత్వం, మత సామరస్యానికి మనల్ని మనం పునరంకితం చేసుకోవడానికి ఆయన జయంతి ఒక సందర్భం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహాత్ముడి 153వ జయంతి సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద ఆమె ఘనంగా నివాళులర్పించారు.  అమృత మహోత్సవాలను నిర్వహించుకుంటున్న సందర్భంలో వచ్చిన ఈ గాంధీ జయంతి మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. భారతదేశం గురించి గాంధీజీ కన్న కలల సాకారం కోసం మనమందరం కృషి చేయాల్సిన సమయం ఇదేనని పిలుపునిచ్చారు.

* మరో ప్రముఖ నేత, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రికి సైతం దిల్లీలోని విజయ్‌ ఘాట్‌లో రాష్ట్రపతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘జై జవాన్‌, జై కిసాన్‌ నినాదమిచ్చిన శాస్త్రీజీ హరిత విప్లవం, శ్వేత విప్లవంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆదర్శాలు ఇప్పటికీ మనందరిలో స్ఫూర్తి నింపుతాయి’’ అని శాస్త్రిని ముర్ము గుర్తుచేసుకున్నారు.

* ప్రధాని మోదీ సైతం దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. గాంధీజీకి నివాళిగా ఖాదీ, దేశీయ హస్తకళల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా జీవించాలని సూచించారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా మోదీ నివాళులర్పించారు. ‘‘నిరాడంబరతకు శాస్త్రీజీ పెట్టింది పేరు. భారత చరిత్రలో చాలా కీలకమైన సమయంలో ఆయన పటిష్ఠ నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని మోదీ ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు.

* గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళులర్పించిన ఇతర ప్రముఖుల్లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు తదితరులు ఉన్నారు.

* మహాత్మా గాంధీ జయంతిని ఏటా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ మహాత్ముడి ఆదర్శాలను గుర్తుచేసుకున్నారు. ఆయన అహింసా మార్గాన్ని అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా శాంతిస్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే యావత్తు ప్రపంచం  ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించగలదని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని