INS Vindhyagiri : తీర రక్షణకు ‘ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి’.. ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

అత్యాధునిక యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి’ని (INS Vindhyagiri) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ప్రారంభించారు. త్వరలో భారత నౌకాదళానికి ‘ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి’ సేవలు అందించనుంది.

Published : 17 Aug 2023 16:31 IST

కోల్‌కతా : భారత నౌకాదళంలో సేవలందించనున్న సరికొత్త యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి’ని (INS Vindhyagiri) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కోల్‌కతాలోని హుగ్లీ నది ఒడ్డునున్న గార్డెన్ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ను (జీఆర్‌ఎస్‌ఈ) సందర్శించారు. ఈ సందర్భంగా అధునాతన స్టెల్త్ యుద్ధ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ‘వింధ్యగిరి’ కర్ణాటక రాష్ట్రంలోని ఓ పర్వత శ్రేణి పేరు. ‘ప్రాజెక్ట్‌ 17ఎ’లో భాగంగా రూపొందించిన ఆరో యుద్ధనౌక ఇది. ఇదే పేరుతో గతంలో ఉన్న యుద్ధనౌక 31 ఏళ్లపాటు సేవలందించింది. 2012 దాకా అది పలు క్లిష్టతరమైన ఆపరేషన్లలో పాల్గొని సత్తా చాటింది.

చంద్రయాన్‌-3 నుంచి విడిపోయిన ‘విక్రమ్‌’.. కీలక ఘట్టం పూర్తి

భారత అమ్ములపొదిలోకి చేరనున్న అత్యాధునిక నౌక ‘ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి’లో సరికొత్త గ్యాడ్జెట్‌లను అమర్చనున్నారు. దీనిని నౌకాదళానికి అప్పగించే ముందు విస్తృత స్థాయిలో.. వివిధ రకాలుగా పరీక్షించి చూస్తామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. ‘పీ17ఎ’ నౌకలన్నీ గైడెడ్‌ మిస్సైల్‌ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఒక్కో నౌక పొడవు 149 మీటర్లు ఉంటుంది. 6,670 బరువుతో.. ఇవి 28 నాట్స్‌ వేగంతో ప్రయాణించగలవని ఓ అధికారి తెలిపారు. ఇవి శివాలిక్‌ క్లాస్‌ ప్రాజెక్ట్ 17 యుద్ధనౌకల కంటే మెరుగైనవని చెప్పారు. అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్‌ఫామ్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు వీటిలో పొందుపరిచినట్లు వెల్లడించారు. భూమి, ఆకాశం, నీటి లోపల నుంచి ఎదురయ్యే సవాళ్లకు ఇవి దీటుగా బదులిస్తాయని రక్షణశాఖ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని