MS Swaminathan: ఆకలి తీర్చిన మహనీయుడా.. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు!

ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ మృతిపట్ల దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు సందేశాలు పోస్ట్‌ చేస్తున్నారు.

Updated : 28 Sep 2023 18:55 IST

దిల్లీ: భారత హరితవిప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌(98)(MS Swaminathan) మృతి పట్ల యావత్‌ దేశం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అధికార, విపక్ష నేతలతో పాటు పలువురు దేశానికి ఆయన చేసిన విశేష సేవలను స్మరించుకొంటున్నారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాలు తెలుపుతూ ఎక్స్‌ (ట్విటర్‌)లో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 

అంతులేని ఆవేదనకు గురిచేసింది.. రాష్ట్రపతి

అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ మరణంతో అంతులేని విషాదానికి గురయ్యానని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆహార భద్రత కోసం విశేష కృషిచేసిన దార్శనికుడు అని కొనియాడారు. ఆహార ధాన్యాలలో మన దేశానికి స్వావలంబనను చేకూర్చిన హరిత విప్లవ పితామహుడిగా పేరు గడించారని గుర్తు చేసుకున్నారు. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ సైన్స్‌ వారసత్వాన్ని వదలి వెళ్లారని.. ఇది మానవాళికి సురక్షితమైన, ఆకలిలేని భవిష్యత్తు వైపు ప్రపంచాన్ని నడిపించేందుకు మార్గదర్శక కాంతి పుంజంగా ఉపయోగపడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.

సంక్లిష్ట సమయంలో అద్భుతం చేశారు.. మోదీ

డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ మరణం తీవ్ర బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశ చరిత్రలో చాలా సంక్లిష్టమైన సమయంలో వ్యవసాయ రంగంలో ఆయన చేసిన అద్భుతమైన కృషి కోట్లాదిమంది ప్రజల జీవితాలను మార్చేసిందని గుర్తు చేశారు. తద్వారా దేశ ఆహారభద్రతకు భరోసా కల్పించారన్నారు.  వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కృషితో పాటు ఆవిష్కరణలకు ఆయనను ఓ పవర్‌ హౌస్‌గా పేర్కొన్నారు. పరిశోధనలు, మార్గనిర్దేశంలో ఆయనకు ఉన్న తిరుగులేని నిబద్ధత అసంఖ్యాక శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలపై చెరగని ముద్ర వేసిందన్నారు. డాక్టర్ స్వామినాథన్‌తో సంభాషణలను తాను ఎల్లప్పుడూ మనసులోనే ఉంచుకుంటానని తెలిపారు. స్వామినాథన్‌ జీవితం, ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎంఎస్‌ స్వామినాథన్‌ కన్నుమూత

ఎప్పటికీ గుర్తుండిపోతారు: రాహుల్‌

ఎంఎస్‌ స్వామినాథన్‌ మరణం పట్ల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తంచేశారు. మన దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు స్వామినాథన్‌ నిబద్ధత, ఆయన చేసిన కృషి ఈరోజు మనల్ని ఆహార ధాన్యాల మిగులు దేశంగా మార్చిందని కొనియాడారు. హరిత విప్లవ పితామహుడిగా ఆయన వారసత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ కష్ట సమయంలో ఆయనను అభిమానించే వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 

వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది..: కేసీఆర్‌

ఎంఎస్‌ స్వామినాథన్‌ మరణంతో దేశ వ్యవసాయరంగం పెద్దదిక్కును కోల్పోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఆహారాభివృద్ధిలో మనం స్వయం సమృద్ధి సాధించడానికి ఆయన కృషే కారణమన్నారు.  దేశ వ్యవసాయ రంగంలో ఆయన చేసిన పరిశోధనలు, సిఫారసులు విప్లవాత్మక మార్పులకు నాందిపలికాయని సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రతి రైతు హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత స్వామినాథన్‌ ఇక్కడికి రావడం, ఆయనతో జరిగిన సమావేశాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.  ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమావేశంలో వ్యవసాయాభివృద్ధిని తెలుసుకొని ఎంతో ఆనందపడ్డారని.. వీలు చూసుకొని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్‌.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు. 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేశారు: జగన్‌

వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను సమూలంగా మార్చిన గొప్ప వ్యక్తి స్వామినాథన్ అని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.  ఆయన చేసిన కృషి మర్చిపోలేనిదని.. వ్యవసాయ రంగం, దేశాన్ని ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా చేశారన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

రైతు లోకానికి తీరని లోటు: నారా లోకేశ్‌

ఎంఎస్‌ స్వామినాథన్‌ మృతి బాధాకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఆ మహనీయుడి మరణం యావత్‌ రైతు లోకానికి తీరని లోటు అన్నారు. నిరంతరం రైతాంగ సంక్షేమం కోసమే పరితపించారంటూ కొనియాడారు. 

వ్యవసాయ రంగానికి తీరని లోటు: పవన్‌

దేశంలో హరితవిప్లవానికి ఆద్యులైన ఎంఎస్‌ స్వామినాథన్‌ మరణవార్త తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పెరుగుతున్న దేశ జనాభా అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలను సమకూర్చేందుకు అవసరమైన వంగడాలను తీసుకురావడంలో ఆయన చేసిన కృషిని దేశ రైతాంగం, వ్యవసాయ రంగ నిపుణులు ఎప్పటికీ మరిచిపోరన్నారు. ఆయన పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ ద్వారా అనేక పరిశోధనలు చేయడం ద్వారా దేశ అభ్యున్నతి కోసం ఎంతో కృషిచేస్తున్నారని కొనియాడారు. ఆయన మరణం దేశ వ్యవసాయ రంగానికి తీరని లోటన్నారు. 

రైతులకు MSP సిఫారసు చేసింది ఆయనే.. సీపీఎం 

ఎంఎస్‌ స్వామినాథన్‌ మృతిపట్ల సీపీఎం పొలిట్‌బ్యూరో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దేశానికి ఆయన చేసిన అపార సేవలను కొనియాడింది. 1960లలో అధిక దిగుబడినిచ్చే గోధుమలు, వరి రకాలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని ప్రచారం చేయడంలో ఆయన కృషిని గుర్తింపుగా వరల్డ్‌ ఫుడ్‌ప్రైజ్‌ను అందుకొన్న తొలి వ్యక్తి ఆయనేనని గుర్తు చేసింది. 1988లో స్వామినాథన్‌ రీసెర్చి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారని పేర్కొంది. రైతుల జాతీయ కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించాలని సిఫారసు చేశారని..  ఉత్పత్తి వ్యయంపై 50శాతం ధర నిర్ణయించాలని సూచించారని గుర్తు చేసింది. రైతుల పోరాటాల్లో ఈ అంశం ఇప్పటికే ఓ ప్రధాన డిమాండ్‌గానే ఉందన్న అంశాన్ని గుర్తు చేసింది.  ఆ మహనీయుడి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢసానుభూతి తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని