Banwarilal Purohit : టమాటా వంటకాలను రాజ్‌భవన్‌ మెనూ నుంచి తొలగిస్తున్నా : పంజాబ్‌ గవర్నర్‌

మార్కెట్లో టమాటా (Tomato) ధరలు దూసుకుపోతుండటంతో ఆ వంటకాలను పంజాబ్‌ (Punjab) గవర్నర్‌ (Governor) తన మెనూ నుంచి తొలగించారు. ఈ చర్యతో ధరలు దిగివస్తాయని ఆయన ఆశిస్తున్నారు. 

Published : 03 Aug 2023 22:50 IST

చండీగఢ్‌ : టమాటా (Tomato) ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో పంజాబ్ (Punjab) గవర్నర్ (Governor) బన్వరిలాల్ పురోహిత్‌ (Banwarilal Purohit) సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి కొన్ని రోజులపాటు రాజ్‌ భవన్‌లో టమాటా లేని వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తన కార్యాలయ సిబ్బందికి సూచించారు. కేజీ టమాటా ధర రూ.200 దాటిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు టమాటా వినియోగం తగ్గించడం వల్ల ధరలను అదుపులోకి తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

మరణాలు ఆగాలంటే.. ఆ చీతాలు రావాల్సిందే!

పంజాబ్ గవర్నర్‌ బన్వరిలాల్ పురోహిత్‌ చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతానికి పరిపాలకుడిగానూ వ్యవహరిస్తున్నారు. తన తాజా నిర్ణయంతో ధరలు దిగివస్తాయని ఆయన ఆశిస్తున్నారు. అధిక ధరల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ‘ఏదైనా ఒక వస్తువును వినియోగించడం తగ్గిస్తే దానికున్న డిమాండ్ తగ్గుతుంది. దాంతో ఆటోమేటిక్‌గా ధరలు తగ్గుతాయి. ప్రజలు తమ ఇళ్లలో టమాటాలకు ప్రత్యామ్నాయ కూరగాయలను వినియోగించాలి. దాంతో టమాటా ధరలు దిగివచ్చే అవకాశం ఉంది’ అని పంజాబ్ గవర్నర్ అభిప్రాయపడ్డారు. 

టమాటా ధరల పెరుగుదలకు పలు కారణాలున్నాయని రాజ్ భవన్ కార్యాలయం పేర్కొంది. సరఫరా గొలుసులో తేడాలు, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ శక్తులు అందుకు కారణమని తెలిపింది. ఇదిలా ఉంటే.. గత నెలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి ప్రతిభా శుక్లా మాట్లాడుతూ టమాటాలను ప్రజలు కొనుగోలు చేయలేకపోతే ఇంట్లోనే వాటిని పెంచుకోవాలని సూచించారు. తినడం మానేస్తే ధరలు అవే దిగొస్తాయని ఆమె సూత్రీకరించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని