Rahul Gandhi: సిద్ధూ కుటుంబానికి రాహుల్‌ పరామర్శ.. తండ్రి కన్నీరుమున్నీరు

కాంగ్రెస్‌ సీనియర్​ నేత రాహుల్‌ గాంధీ హత్యకు గురైన ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించారు.......

Updated : 07 Jun 2022 16:33 IST

చండీగఢ్‌: కాంగ్రెస్‌ సీనియర్​ నేత రాహుల్‌ గాంధీ పంజాబ్‌లోని మాన్సా జిల్లాకు చేరుకొని హత్యకు గురైన ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిద్ధూ తండ్రి బాల్‌కౌర్‌ సింగ్‌.. రాహుల్‌ను చూడగానే ఆయన్ను హత్తుకొని కన్నీరుమున్నీరయ్యారు. మంగళవారం ఉదయం చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్​.. నేరుగా సిద్ధూ స్వగ్రామానికి వెళ్లారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా, మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్​ వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో మూసేవాలా నివాసం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హత్య జరిగిన సమయంలో రాహుల్‌ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ వీకెండ్‌లో తిరిగి చేరుకున్న ఆయన.. నేడు మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు.

సిద్ధూ తల్లిదండ్రులను గత శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిశారు. అంతకుముందు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా మూసేవాలా కుటుంబ సభ్యులను కలిసి సంతాపం వ్యక్తం చేశారు. హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని, తద్వారా కుటుంబానికి త్వరగా న్యాయం జరిగేలా చూడాలని సీఎం మాన్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్​ సింగ్ బజ్వా లేఖ రాశారు. మరోవైపు, ఈ కేసులో నిందితుల తరపున న్యాయవాదులెవరూ వాదించకూడదని తాము తీర్మానించామని లాయర్ల అసోసియేషన్​ వెల్లడించింది. సిద్ధూ కుటుంబానికి న్యాయపరంగా ఉచితంగా సహాయం చేస్తామని న్యాయవాదులు తెలిపారు.

మే29న సిద్ధూ మూసేవాలా(28) దారుణ హత్యకు గురయ్యాడు. మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా దారిలో గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి.. అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. గ్యాంగ్‌స్టర్‌ గొడవల కారణంగానే సిద్ధూ మూసేవాలా హత్య జరిగినట్లు పంజాబ్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. గతేడాది అకాలీదళ్‌ నాయకుడు విక్కీ మిద్దుఖేరా హత్య కేసులో మూసేవాలా మేనేజర్ పేరు బయటకురావడంతో సిద్ధూపై కక్షగట్టిన దుండగులు అతడిని హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని