Rajnath Singh: ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి.. పాకిస్థాన్‌కు భారత్‌ చురకలు

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను (PoK)ను తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్‌కు పెద్ద విషయమేమీ కాదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) స్పష్టం చేశారు.

Published : 26 Jun 2023 20:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉగ్రవాదంపై భారత్‌-అమెరికా చేసిన సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్‌ (Pakistan) అభ్యంతరం వ్యక్తం చేయడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) దీటుగా స్పందించారు. కశ్మీర్‌ వంటి అంశాలపై మాట్లాడేందుకు బదులు.. ముందు మీ దేశంలో నెలకొన్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించుకోవాలని బదులిచ్చారు. భారత జాతీయ భద్రత అంశంపై జమ్మూలో కీలక ప్రసంగం చేసిన ఆయన .. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను (PoK)ను తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్‌కు పెద్ద విషయమేమీ కాదన్నారు.

‘కశ్మీర్‌ అంశాన్ని పదే పదే ప్రస్తావించినప్పటికీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ముందు మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను చూస్తే.. అక్కడ ఎప్పుడేం జరిగినా ఆశ్చర్యం లేదు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత్‌కు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. భారత భూభాగంలో ఉన్నవారు ఎంత ప్రశాంత జీవనం సాగిస్తున్నారో పాక్‌ ఆక్రమణలో ఉన్న ప్రజలు చూస్తున్నారు. అదే పాక్‌ మాత్రం వారికి అన్యాయం చేస్తోంది. పీఓకే అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భారత్‌లో అంతర్భాగమే’ అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా పీఓకేను ఆక్రమించుకోవడం వల్ల పాకిస్థాన్‌కు ఎటువంటి అధికారాలు ఉండవని.. ఇది భారత్‌లో అంతర్భాగమని పార్లమెంటు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. కేవలం ఒక్కసారి కాకుండా.. అనేక తీర్మానాలను పార్లమెంట్‌ చేసిందన్నారు.

ఉగ్రవాదంపై పోరుకు భారత్‌-అమెరికా దేశాలు కలిపి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఇరుదేశాలు సంయుక్తంగా నినదించాయి. ఈ క్రమంలో పాక్‌ భూభాగాన్ని ఉగ్రదాడులకు కేంద్రంగా ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలని అమెరికా-భారత్‌లు సంయుక్త ప్రకటన చేశాయి. ఈ సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అది పూర్తిగా అసమంజసమైందని, ఏకపక్షంగా, తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది. పాకిస్థాన్‌ను ఉద్దేశించి అమెరికా, భారత్‌లు చేసిన ప్రకటన.. దౌత్యనియమాలకు విరుద్ధంగా ఉన్నాయని వాపోయింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు భారత్‌ మరోసారి దీటుగా సమాధానమిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని