Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. భాజపా శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. 

Updated : 03 Sep 2023 16:46 IST

చెన్నై: తమిళనాడు రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తున్నాయి. ‘‘సనాతన ధర్మాన్ని (sanatana dharma) నిర్మూలించాలి’’ అంటూ శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలపై భాజపా సహా, హిందూ సంఘాలు విరుచుకుపడుతున్నాయి.

‘తమిళనాడు ప్రొగ్రెసివ్‌ రైటర్స్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ శనివారం ‘సనాతన నిర్మూలన’ అనే ఇతివృత్తంతో సదస్సు నిర్వహించింది. దీనికి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు.

ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలపై భాజపా శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. తమిళనాడులో కొంత మంది నిజస్వరూపం ఇప్పుడు బయటపడుతోందని వ్యాఖ్యానించారు. ఇటీవల నిర్వహించిన కాశీ, తమిళ సంగమం కార్యక్రమాన్ని ఆ రాష్ట్రంలో ప్రతి గ్రామం ఆదరించిందని తెలిపారు. సనాతన ధర్మం శాశ్వతమైనదని.. ఇలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యల వల్ల దానికి ఏమీ జరగబోదని అన్నారు. భాజపా మరో నేత షానవాజ్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ ‘ఇండియా’ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆయన తనయుడైన ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అలాగే కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు ఉదయనిధి వ్యాఖ్యలపై తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని