CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం

CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 

Updated : 19 Mar 2024 16:32 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) కేంద్రం అమల్లోకి తీసుకురావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ చట్టం అమలుపై స్టే విధించాలని పిటిషనర్లు కోరగా.. కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.

2019లో పార్లమెంట్‌ ఆమోదం పొందిన సీఏఏను సవాల్‌ చేస్తూ అప్పట్లోనే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలు ఇంకా నోటిఫై చేయకపోవడంతో ఆ చట్టం అమల్లోకి రాలేదని కేంద్రం నాడు న్యాయస్థానానికి వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇటీవల పౌరసత్వ సవరణ నిబంధనలు-2024ను సర్కారు నోటిఫై చేయడంతో చట్టం అమలవుతోంది. దీంతో ఈ అంశం మళ్లీ కోర్టుకు చేరింది.

తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు

సీఏఏ రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ ఇప్పటికే దాఖలైన దాదాపు 200 పిటిషన్లపై తీర్పు వచ్చేవరకు ఆ చట్టం నిబంధనల అమలుపై స్టే విధించాలని తాజాగా పిటిషనర్లు కోరారు. వీటిపై నేడు విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై మూడు వారాల్లోగా తమ సమాధానం తెలియజేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్‌ 9వ తేదీకి వాయిదా వేసింది.

అయితే, అప్పటిదాకా చట్టం అమలుపై స్టే విధించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అంటే.. సీఏఏ అమలు యథావిధిగా కొనసాగనుంది. కాగా.. ఈ చట్టంతో ఏ వ్యక్తి పౌరసత్వాన్ని తొలగించబోమని విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని