Gold Smuggling: 3,917 కిలోల బంగారం స్వాధీనం.. కేంద్రం వెల్లడి

ఈ ఏడాది రికార్డు స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని సీజ్‌ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. జనవరి నుంచి అక్టోబర్‌ వరకు 3,917.52కిలోలు సీజ్‌ చేసినట్లు తెలిపింది. 

Published : 12 Dec 2023 21:29 IST

Gold Smuggling | దిల్లీ: దేశంలో బంగారం అక్రమ రవాణా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పెద్ద ఎత్తున బంగారం (Gold) స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించిన గణాంకాలు పేర్కొంటున్నాయి.  ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు 3,917.52 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకోగా.. 4,795 కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌధురి రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా 2020 నుంచి బంగారం అక్రమ రవాణాకు సంబంధించి నమోదైన కేసుల వివరాలు వెల్లడించారు. 2022లో 3,502.16 కిలోల బంగారం సీజ్‌ చేసి 3,982 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే, 2021లో 2,383 కిలోల బంగారం సీజ్‌ చేసి 2,445 కేసులు నమోదు చేయగా.. 2020లో 2,155 కిలోల అక్రమ బంగారం సీజ్‌ చేసి 2,567 కేసులు నమోదు చేసినట్లు గణాంకాల్లో వెల్లడించారు.

బంగారం అక్రమ రవాణాను నియంత్రించేందుకు కస్టమ్స్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు, అక్రమ బంగారు రవాణా ముఠాల కార్యకలాపాలపై నిఘా పెట్టి, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని పనిచేస్తాయన్నారు. ఈ స్మగ్లింగ్‌లో భారతీయులతో కలిసి సిండికేట్లుగా ఏర్పడి పనిచేసే విదేశీయులకు సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 2020 నుంచి ఆ తరహా కేసులు ఏడు నమోదయ్యాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని