NCP Crisis: ప‘వార్‌’లో అబ్బాయిదే పైచేయి..! శరద్‌ పవారే మా దేవుడన్న అజిత్‌

సంక్షోభంలో చిక్కుకుపోయిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP)లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, రెబల్‌ నేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌లు నిర్వహించిన ఎమ్మెల్యేల బల ప్రదర్శనలో అజిత్‌ పైచేయి సాధించినట్లయ్యింది.

Updated : 05 Jul 2023 22:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్షోభంలో చిక్కుకుపోయిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP)లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, రెబల్‌ నేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ (Ajit Pawar)లు నిర్వహించిన ఎమ్మెల్యేల బల ప్రదర్శనలో అజిత్‌ పైచేయి సాధించారు. ఆయన ఏర్పాటు చేసిన సమావేశానికి 32మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే, తమకు మొత్తంగా 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) సమావేశానికి మాత్రం కేవలం 18మంది మాత్రమే హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మద్దతుదారులను ఉద్దేశించి అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

శరద్‌ పవారే మా దేవుడు..

‘శరద్‌ పవార్‌ మా నేత, గురువు. ఆయనే మా దేవుడు. అందులో మరో ప్రశ్నే లేదు. ఆయన ఆశీర్వాదాలు ఆశిస్తున్నాం. కానీ, ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న రాజకీయాలన్నింటినీ మీరు చూస్తూనే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల కోసం పనిచేయాలని అనుకుంటున్నాం. 2004లో కాంగ్రెస్‌ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయ్‌. ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశం ఎన్సీపీకి వచ్చినప్పటికీ అప్పుడు వదిలేశాం. రాష్ట్ర సంక్షేమం కోసం కొన్ని ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి. నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది. భాజపాలో నేతలు 75ఏళ్లకే పదవీవిరమణ తీసుకుంటారు (83 ఏళ్ల శరద్‌ పవార్‌ను ఉద్దేశిస్తూ). రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ స్థాపించాం. రాష్ట్రానికి ఓ బలమైన నేత కావాలి. శరద్‌ పవారే మాకు స్ఫూర్తి’ అని అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. అంతకుముందు ఎన్సీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ.. మేం చేస్తున్న పనికి మమ్మల్ని ఆశీర్వదించండి అని శరద్‌ పవార్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: శరద్‌ పవార్‌ ఆశీస్సుల వల్లే.. ఎన్‌సీపీలో తిరుగుబాటు..!

శివసేనతో పొత్తుకు ముందు భాజపాతో 5 భేటీలు..

ఈ సందర్భంగా శరద్‌ పవార్‌పై అజిత్ సంచలన ఆరోపణలు చేశారు. శివసేనతో పొత్తుకు ముందు భాజపాతో ఎన్సీపీ 5సార్లు సమావేశాలు జరిపిందని అన్నారు. ‘‘2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన, భాజపా విడిపోయాయి. ఆ సమయంలో భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని మా ఎన్సీపీ పార్టీ కాషాయ నేతలతో ఐదు సార్లు సమావేశాలు జరిపింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ.. మనం భాజపాతో పొత్తు పెట్టుకోవడం లేదని, శివసేనతో కలిసి వెళ్తున్నామని నాకు చెప్పారు. ఇక, గతేడాది శివసేనలో ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటు చేసినప్పుడు.. భాజపాతో చేతులు కలపాలని ఎన్సీపీలోని ఎమ్మెల్యేలంతా కోరుకున్నారు. అందరి సంతకాలు కూడా సేకరించాం. మా అభిప్రాయాలను అంగీకరించాలని శరద్‌ పవార్‌ను కోరాం. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. అప్పుడు కూడా శరద్‌ పవార్‌ అంగీకరించినట్లే కన్పించారు. భాజపాతో ఫోన్లో మాట్లాడమని చెప్పారు. కానీ మళ్లీ వెనుకంజ వేశారు. ఇదంతా నిజం కాదని చెప్పమనండి. ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన కాపీలు నా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు నన్ను విలన్‌గా చేస్తున్నారు’’ అని అజిత్‌ పవార్‌ వెల్లడించారు.

అజిత్‌కు 32, పవార్‌కు 18 మంది..

ఎన్సీపీ ఎమ్మెల్యేల బల ప్రదర్శనలో భాగంగా ఎంఈటీ బాంద్రాలో అజిత్‌ పవార్‌ వర్గం ప్రత్యేకంగా భేటీ నిర్వహించింది. దీనికి ఎన్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నేతలు హాజరు కావాలని అజిత్‌ పవార్‌ పిలుపునిచ్చారు. దీంతో 32 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరితో పాటు ఐదుగురు ఎమ్మెల్సీలు కూడా సమావేశానికి వచ్చారు. మరోవైపు ముంబయిలోని వైబీ చౌహాన్‌ ఆడిటోరియంలో శరద్‌ పవార్‌ వర్గం ఏర్పాటు చేసిన సమావేశానికి 18 మంది పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపీలు హాజరై తమ మద్దతు తెలియజేశారు. మిగతా  ఎమ్మెల్యేలు మాత్రం ఇరువర్గాల సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఎన్సీపీకి మొత్తంగా 53 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే.

పార్టీ పేరు, గుర్తు కోసం ఈసీ వద్దకు..

ఇదిలా ఉండగా.. ఎన్సీపీలో వర్గ పోరు ఇప్పుడు ఎన్నికల సంఘం వద్దకు చేరింది. పార్టీలో తమకు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్న అజిత్‌ పవార్‌ వర్గం ఈసీని ఆశ్రయించింది. వారికి మద్దతుగా ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల అఫిడవిట్లను ఈసీకి సమర్పించింది. పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తును తమ వర్గానికి కేటాయించాలని అజిత్‌ వర్గం ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని