Sharad Pawar: డబ్ల్యూఎఫ్‌ఐపై వేటు ఆలస్యమైంది కానీ: శరద్‌ పవార్ వ్యాఖ్యలు

డబ్ల్యూఎఫ్‌ఐ(WFI) కొత్త పాలక వర్గం అత్యుత్సాహం కారణంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కొరడా ఝళిపించింది. దీనిపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. 

Updated : 25 Dec 2023 19:49 IST

పుణె: కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) పై సస్పెన్షన్ విధిస్తూ కేంద్ర క్రీడా శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌(Sharad Pawar) స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని క్రీడాశాఖ కాస్త ముందుగా తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

డబ్ల్యూఎఫ్‌ఐ(WFI) నియమావళికి విరుద్ధంగా ఈ నెల 28 నుంచి అండర్‌-15, 20 జాతీయ ఛాంపియన్‌షిప్స్‌ నిర్వహిస్తామని ప్రకటించడం, పాత కార్యవర్గం (పరోక్షంగా బ్రిజ్‌భూషణ్‌) నియంత్రణలోనే ఇంకా సమాఖ్య ఉండటం లాంటి కారణాలతో క్రీడా శాఖ కొత్త పాలక వర్గంపై కొరడా ఝళిపించింది. దీనిపై పవార్‌ స్పందిస్తూ.. ‘మహిళా రెజ్లర్ల పట్ల అభ్యంతరకర ప్రవర్తన విషయంలో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఇంకా ముందుగానే తీసుకొని ఉండాల్సింది. ఈ నిర్ణయం ఆలస్యం అయినప్పటికీ.. ప్రస్తుత చర్యను స్వాగతిస్తున్నాను’ అని వెల్లడించారు.

‘రైతులపై కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన భాజపా’

లైంగిక వేధింపుల ఆరోపణలతో మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్ సింగ్‌(Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా సాక్షి మలిక్‌, బజ్‌రంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ తదితర రెజ్లర్లు పోరాటం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఎన్నికల్లో అతడి సన్నిహితుడు గెలుపొందడం వారిని కలచివేసింది. దాంతో కొందరు రెజ్లర్లు ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు, మరికొందరు అవార్డులు తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే క్రీడామంత్రిత్వశాఖ డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త పాలకమండలిపై వేటు వేసింది.

దీనిపై సాక్షి మలిక్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఇది మంచి అడుగు అని పేర్కొన్నారు. మరోపక్క ఈ పరిణామాల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లు, ఆటతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు చెప్పాడు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని