Bengaluru: రైతులపై కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన భాజపా

రైతులపై కర్ణాటక మంత్రి శివానంద పాటిల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్ష భాజపా తీవ్రంగా మండిపడింది.

Updated : 25 Dec 2023 16:22 IST

బెంగళూరు: రైతులపై కర్ణాటక (Karnataka)మంత్రి శివానంద పాటిల్‌ (Shivanand Patil) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెళగావిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన రైతు రుణ మాఫీల గురించి ప్రస్తావించారు. తమ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసేందుకు రైతులు ఏటా కరవును కోరుకుంటున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్ష భాజపా తీవ్రంగా మండిపడింది.

‘‘రైతులకు కరెంట్‌, నీరు ఉచితంగా లభిస్తున్నాయి. ఎంతో మంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో వ్యవసాయరంగ విస్తరణకు సహకారం అందించారు. అయితే ఏటా కరవు రావాలని రైతులు కోరుకుంటున్నారు. ఎందుకంటే దీని వల్ల ప్రభుత్వం వారి రుణాలను మాఫీ చేస్తుందని భావిస్తున్నారు. కానీ, మీరు అలా కోరుకోవడం సరికాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం మంత్రి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదంగా మారాయి. 

రైతులను అవహేళన చేస్తూ శివానంద మాట్లాడడంపై భాజపా మండిపడింది. పాటిల్‌ను మంత్రి వర్గం నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేసింది. సీఎం సిద్ధరామయ్య కేబినెట్‌ అంతా అజ్ఞానులతో నిండిపోయిందని విమర్శించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను అవమానించిందని.. ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమని దుయ్యబట్టింది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది.

ఈ ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యేలోగా.. హాలిడే అయిపోతుందేమో..! మనాలి జామ్‌పై నెటిజన్ల రియాక్షన్‌

మంత్రి శివానంద పాటిల్‌ గతంలోనూ రైతుల ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు అందించే నష్టపరిహారాన్ని ప్రభుత్వం పెంచిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వం నుంచి పరిహారాన్ని కోరడంలో తప్పు లేదు. కానీ మరికొన్ని సందర్భాల్లో ఆర్థిక సహాయం కోసం వ్యక్తుల సహజ మరణాలను కూడా ఆత్మహత్యలుగా చూపిస్తున్నారు’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ తర్వాత పాటిల్‌ స్పందిస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని