Sperm Count: మగవారిలో వాటి సంఖ్య తగ్గుతోందట..!

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మగవారిలో వీర్యకణాల తగ్గుదల సంతానోత్పత్తితోపాటు, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మొత్తం 53 దేశాల్లో మగవారి నుంచి పరిశోధన బృందం నమూనాలను సేకరించింది.

Published : 15 Nov 2022 22:09 IST

దిల్లీ: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతున్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇది సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతోందని తెలిపింది. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా పురుషుడి ఆయుః ప్రమాణాన్ని సైతం తగ్గిస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇది దీర్ఘకాలిక వ్యాధులు, టెస్టిక్యులర్‌ క్యాన్సర్‌ వంటి దుష్పరిణామాలకూ దారితీస్తున్నట్లు పేర్కొన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, మారుతున్న జీవనశైలే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. 

2011-2018 మధ్య కాలంలో 53 దేశాలకు చెందిన పురుషుల నుంచి నమూనాలను సేకరించారు. ప్రాంతాల వారీగా మగవారిలో వీర్యకణాలు తగ్గుదల ఏ విధంగా ఉందనే దానిపై అధ్యయనం చేశారు. దాని ఆధారంగా ఇజ్రాయెల్‌లో జెరూసలేంలోని హిబ్రూ యూనివర్శిటీ పరిశోధన బృందం నిర్వహించిన అధ్యయనం.. హ్యూమన్‌ రీప్రొడక్షన్‌ అప్‌డేట్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో నివసించే మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతుదల సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. భారత్‌లోనూ ఈ పరిస్థితి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా గత 46 ఏళ్లలో 50శాతం తగ్గితే.. ఈ మధ్యకాలంలో తగ్గుదల మరీ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వీర్యకణాల సంఖ్య తగ్గుదలకు గల కారణాలపై అధ్యయనం నిర్వహించనప్పటికీ కచ్చితమైన వివరాలేమీ వెల్లడించలేదు. జీవనశైలి, పర్యావరణంలో రసాయనాల వాడకం పెరగడం వంటివి అధికంగా ప్రభావం చూపిస్తున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌  హగాయ్‌ లెవినే అంచనా వేశారు. ఈ పరిణామాలు మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు, పునరుత్పత్తి, వాతావరణంలో హానికారకాలను తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా త్వరితగతిన కార్యాచరణను అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. వీర్యకణాల తగ్గుదల మగవారిలో సంతానోత్పత్తిని తగ్గించడమే కాకుండా, వారి ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని అమెరికాలోని ఇకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ షాన్నా స్వాన్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని