Published : 04 Dec 2021 01:23 IST

Taiwan: చైనాకు ‘కీల్‌’ నొప్పి..!

 కీలక దశకు తైవాన్‌ సబ్‌మెరైన్ల నిర్మాణ ప్రాజెక్టు 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: చైనా కబంధ హస్తాల్లో చిక్కకుండా, సొంతగానే డ్రాగన్‌ను ఎదుర్కొనేందుకు తైవాన్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భారత్‌ సహా పలు దేశాలు తైవాన్‌కు అండగా నిలిచినట్లు వార్తలొస్తున్నాయి. చైనాను తీవ్ర ఆందోళనకు గురిచేసే పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. తైవాన్‌ ఏకంగా సబ్‌మెరైన్ల నిర్మాణ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తోంది. 

తాజాగా ఏం జరిగింది..?

నవంబరు మధ్యలో తైవాన్‌ సబ్‌మెరైన్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కీలక దశ దాటినందుకు ‘కీల్‌ లేయింగ్‌’ ఉత్సవాన్ని నిర్వహించింది. దీనికి మీడియాను ఆహ్వానించలేదు. కానీ, ఓ ఛానల్‌ ప్రసారం చేసిందంటూ తైవాన్‌ న్యూస్‌ పత్రిక ఈ కార్యక్రమం ఫొటోలతో సహా కథనాన్ని రాసింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు తైవాన్‌ కూడా పెద్దగా ప్రయత్నించలేదు. నవంబరు 30న  తైవాన్‌లో అధికారిక డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ త్సాయి షిహ్‌ యంగ్‌ మాట్లాడుతూ.. ‘‘తైవాన్‌కు సహకరిస్తున్నందుకు ప్రపంచంలో సబ్‌మెరైన్లు తయారు చేసే ప్రధాన దేశాలకు థ్యాంక్స్‌. అవి ఎన్ని దేశాలన్నది ముఖ్యం కాదు. మా సబ్‌మెరైన్ల ప్రాజెక్టులో జోక్యానికి చైనా ప్రయత్నించదని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 

తైవాన్‌ సబ్‌మెరైన్‌ ప్రాజెక్టుకు బ్రిటన్‌, అమెరికా, కెనడాల్లోని సంస్థలు సాయం చేస్తున్నట్లు ఓ ఆంగ్ల వార్త సంస్థ వెల్లడించింది. దీంతోపాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌, స్పెయిన్‌, కెనడా దేశాలకు చెందిన నావికాదళ మాజీ అధికారులు, టెక్నిషీయన్లను తైవాన్‌ నియమించకొన్నట్లు వెల్లడించింది.

ఏళ్లపాటు  అడ్డంపడిన చైనా..!

తైవాన్‌ సొంతగా బలపడకుండా చైనా కొన్నేళ్లపాటు అడ్డుకొంది. మరోపక్క చైనా మాత్రం అడ్డగోలుగా నావిదళ బలాన్ని పెంచుకొంటోంది. దీంతో పట్టుదలగా ప్రయత్నించి తైవాన్‌ సొంతగా సబ్‌మెరైన్ల తయారీనే మొదలుపెట్టింది. తైవాన్‌ నావికాదళమైన ‘ది రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా నేవీ’ వద్ద ఇప్పటికీ చాలా పురాతన సబ్‌మెరైన్లు ఉన్నాయి. 1973లో అమెరికా తయారు చేసిన టెంచ్‌, బాలో క్లాస్‌ సబ్‌మెరైన్లు, 1987లో డచ్‌ తయారు చేసిన జ్వార్డివ్స్‌ సబ్‌మెరైన్లు రెండు మాత్రమే ఉన్నాయి. ఇక 1980ల్లో అమెరికా నుంచి టార్పిడోలు కొనుగోలుకు తైవాన్‌ యత్నించినా.. సాధ్యంకాలేదు. 1940ల్లో అమెరికా తయారు చేసిన మరో సబ్‌మెరైన్లు ఉన్నాయి.  ఇవి చైనాతో యుద్ధంలో ఏమాత్రం ఉపయోగపడవు. వీటిని కేవలం శిక్షణకు మాత్రమే వాడుతున్నారు. 1980 నుంచే తైవాన్‌కు సబ్‌ మెరైన్లు అందకుండా చైనా తీవ్ర యత్నాలు మొదలుపెట్టింది.

తైవాన్‌కు సహనం నశించి..!

చైనా తీరుతో 2015లో తైవాన్‌కు సహనం నశించింది. దీంతో అమెరికా, జపాన్‌ దేశాల్లో కీలకమైన సబ్‌మెరైన్‌ టెక్నాలజీ సంస్థలతో తైవాన్‌ షిప్‌బిల్డింగ్‌ సంస్థ సీఎస్‌బీసీ ఒప్పందం చేసుకొంది. గతేడాది కొహ్సింగ్‌ సీఎస్‌బీసీ కర్మాగారం తైవాన్‌ కీలక నేతలు కలిసి సబ్‌మెరైన్ల తయారీని లాంఛనంగా ప్రారంభించారు. అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌ వెన్‌ దీనికి సంబంధించిన ఫొటోలను ట్వీట్‌ చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే తొలి సబ్‌మెరైన్‌కు ‘కీల్‌ లేయింగ్‌’ ఉత్సవాన్ని గత నెల నిర్వహించారు. సబ్‌మెరైన్‌లో కీలక భాగాల తయారీ, పరీక్షలు విజయవంతమైతే వీటిని నిర్వహిస్తారు. కొత్త సబ్‌మెరైన్‌కు 1168 అనే నెంబర్‌ను కేటాయించారు. 2023 నాటికి ఈ సబ్‌మైరన్‌ను సముద్ర జలాల్లో పరీక్షించాలని నిర్ణయించింది. ఆ తర్వాత మరో ఏడు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అమెరికా కమాండోలు తైవాన్‌ దళాలకు శిక్షణ ఇస్తున్నాయి. ఇప్పుడు దీనికి తోడు సబ్‌మెరైన్ల తయారీకి అమెరికా, మిత్రదేశాలు సాయం చేస్తుండటం డ్రాగన్‌ను ఉకిరి బిక్కిరి చేస్తోంది.  ‘కీల్‌ లేయింగ్‌’ ఉత్సవంపై చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ నవంబర్లోనే స్పందించింది. ‘తైవాన్‌ జలసంధి వద్ద బలాబలాల్లో ఉన్న తేడాలను మార్చలేము. చైనాతో పునరేకీకరణ బలప్రయోగంతో వ్యతిరేకిస్తే పరిస్థితి డెడ్‌ఎండ్‌కు చేరుతుంది’’ అని హెచ్చరించింది.  

Read latest National - International News and Telugu News


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని