Afghanistan: తాలిబన్ల ఆక్రమణతో.. భారత్‌కు ముప్పే..!

అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో దక్షిణాసియాలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికా భద్రతా నిపుణులు పేర్కొన్నారు.

Published : 07 Oct 2021 21:28 IST

అమెరికా జాతీయ భద్రతా విభాగం మాజీ ఉన్నతాధికారి

వాషింగ్టన్‌: అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో దక్షిణాసియాలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికా భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యం (Middle East) లో మాదిరిగానే మతపరమైన హింస సంఘటనల ముప్పు భారత్‌కు పొంచివుందని అమెరికా జాతీయ భద్రతా విభాగం మాజీ ఉన్నతాధికారి జనరల్‌ హెచ్‌ఆర్‌ మెక్‌మాస్టర్‌ విశ్లేషించారు. ముఖ్యంగా అల్‌ఖైదా, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థల ప్రేరేపిత చర్యలతో ఇటువంటి ప్రమాదం అధికంగా ఉందన్నారు. అఫ్గానిస్థాన్‌ వ్యవహారాలకు సంబంధించి ఓ కేసు విచారణ సందర్భంగా అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ ముందు హాజరైన జనరల్‌ మెక్‌మాస్టర్‌ ఈ విధంగా స్పందించారు.

2001 సెప్టెంబర్‌ 10 ముందున్న పరిస్థితుల కంటే అత్యంత ప్రమాదకర పరిస్థితులు అమెరికాతో పాటు యావత్‌ ప్రపంచానికి ఏర్పడ్డాయి. అయితే, ప్రతిదాడులను ఎదుర్కొనే అత్యంత శక్తివంతమైన రక్షణ సామర్థ్యాల కారణంగా 9/11 వంటి దాడులు మాత్రం ఉండవు. అయినప్పటికీ ప్రస్తుతం ఇలాంటి ఉగ్ర ముఠాలు మరింత బలపడుతున్నాయి. కేవలం సంఖ్యా పరంగానే జిహాదీ గ్రూపులు పెరగడం లేదని.. వీటికితోడు వారి విశ్వాసం, ఆర్థికశక్తి రోజురోజుకీ పెరుగుతోందని జనరల్‌ మెక్‌మాస్టర్‌ పేర్కొన్నారు. వేల కోట్ల విలువైన ఆయుధాలు తాలిబన్లకు అప్పగించి వచ్చామని.. కానీ, వారు మాత్రం వాటిని ఇతర ఉగ్రవాద ముఠాలకు చేరవేసే ప్రమాదముందన్నారు. రానున్న రోజుల్లో అత్యంత విధ్వంసకర ఆయుధాలను ఉగ్రవాదులు సొంత చేసుకోవడం ఊహించలేనంత విషయమేమీ కాదని అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌నకు జాతీయ భద్రతా సలహాదారుల్లో ఒకరైన మెక్‌మాస్టర్‌ పేర్కొన్నారు. ఈ పరిణామాలు దక్షిణాసియాకు ప్రమాదకరంగా మారడంతో పాటు భారత్‌కూ హింసాత్మక సంఘటనల ముప్పు తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, ఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా మళ్లీ కోరలు చాచే ప్రమాదం ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉగ్ర సంస్థలు శక్తి సామర్థ్యాలను మరింత పెంచుకుని వచ్చే ఒకటి, రెండు సంవత్సరాల్లోనే అమెరికాపై మళ్లీ దాడులకు తెగబడవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చనిపోయాడని భావిస్తోన్న అల్‌ఖైదా అగ్రనేత ఐమన్‌ అల్‌ జవహరీ బతికే ఉన్నాడనే వార్తలు కూడా అమెరికాను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని