Bipin Rawat: బిపిన్‌ రావత్‌.. 6 ఏళ్లనాటి ఘటనలో మృత్యువును జయించి..!

2015లో ఇటువంటి హెలికాప్టర్‌ ప్రమాదమే బిపిన్‌ రావత్‌కు ఎదురయ్యింది. బిపిన్‌ రావత్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌గా (6ఏళ్ల క్రితం) ఉన్న సమయంలో నాగాలాండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడ్డారు.

Updated : 08 Dec 2021 19:34 IST

తాజా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జనరల్‌ బిపిన్‌ రావత్‌

దిల్లీ: హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రాణాలు కోల్పోయారన్న వార్త యావత్‌ దేశప్రజలను నిశ్చేష్టులను చేసింది. ఈ దుర్ఘటనలో జనరల్‌ బిపిన్‌ భార్య మధులికతో పాటు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే, 2015లో ఇటువంటి హెలికాప్టర్‌ ప్రమాదమే బిపిన్‌ రావత్‌కు ఎదురయ్యింది. బిపిన్‌ రావత్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌గా (6ఏళ్ల క్రితం) ఉన్న సమయంలో నాగాలాండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పుడు మృత్యువును జయించిన బిపిన్‌ రావత్‌.. మరోసారి హెలికాప్టర్‌ ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు ముందు తలవంచాల్సి వచ్చింది.

లెఫ్టినెంట్‌ జనరల్‌గా ఉన్న సమయంలో బిపిన్‌ రావత్‌ (2015 ఫిబ్రవరి 3న) నాగాలాండ్‌ దిమాపుర్‌ జిల్లాలోని  హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరారు. చీతా హెలికాప్టర్‌లో ఆయనతో పాటు మరో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు. హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయిన కొన్ని సెకండ్లకే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బయలుదేరిన అనంతరం కొద్ది ఎత్తుకు వెళ్లగానే హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఆ ప్రమాదంలో హెలికాప్టర్‌ పూర్తిగా దెబ్బతింది. అయినప్పటికీ బిపిన్‌ రావత్‌తోపాటు సిబ్బంది మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే తరహాలో తాజాగా జరిగిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంలో మాత్రం బిపిన్‌ రావత్‌, ఆయన భార్య ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడు నీలగిరి వెల్లింగ్టన్‌కు బయలుదేరిన బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తోన్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదానికి గురయ్యింది. సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌.. కొద్దిదూరం వెళ్లగానే ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో రావత్‌ దంపతులు సహా పదకొండు మంది మృతిచెందినట్లు వాయుసేన అధికారికంగా ధ్రువీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని