
Third Wave: రాష్ట్రంలో థర్డ్ వేవ్ మొదలైంది.. వెల్లడించిన మధ్యప్రదేశ్ సీఎం
భోపాల్: రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ ప్రారంభమైందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోగలమన్న సీఎం.. అలా సాధ్యం కాకపోతే యుద్ధం సజావుగా సాగదని వ్యాఖ్యానించారు. ‘కొవిడ్ థర్డ్‌వేవ్ వచ్చేసింది. ప్రజల భాగస్వామ్యంతోనే దీనిపై పోరాడగలం. ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రజలు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
దేశంలో కరోనా కేసుల్లో మళ్లీ భారీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 27 వేలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు 21 శాతం పెరిగాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల్లో కూడా పెరుగుదల కనిపిస్తోంది. మొత్తం 23 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకూ ఇది విస్తరించింది. శనివారం ఉదయానికి 14 వందలుగా ఉన్న కొత్త వేరియంట్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయానికి 1525కి చేరింది. అత్యధిక కేసులతో మహారాష్ట్ర(460), దిల్లీ (351) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. గుజరాత్(136), తమిళనాడు(117), కేరళ(109) కేసులతో కొనసాగుతున్నాయి.