Omicron: వారం క్రితం హెచ్చరించిన సునామీ ఇప్పుడు మమల్ని తాకుతోంది..!

అమెరికా, ఆస్ట్రేలియా, మరీ ముఖ్యంగా ఐరోపా దేశాలు కరోనా ధాటికి విలవిలలాడుతున్నాయి. వీటిలో కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

Published : 19 Dec 2021 01:28 IST

ప్రపంచాన్ని చుట్టుముడుతోన్న ఒమిక్రాన్ వేవ్..

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా, ఆస్ట్రేలియా.. మరీ ముఖ్యంగా ఐరోపా దేశాలు కరోనా ధాటికి విలవిలలాడుతున్నాయి. వీటిలో కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ పరిస్థితికి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఆజ్యం పోస్తోంది. రానున్న నెలల్లో ఇది తీవ్రంగా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఒమిక్రాన్‌.. మెరుపు వేగంతో.. 

ఐరోపాలో ఒమిక్రాన్ మెరుపు వేగంతో వ్యాపిస్తోందని ఫ్రాన్స్‌ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్ హెచ్చరించారు. రానున్న నెలల్లో దీని ఉద్ధృతి తీవ్రంగా ఉండనుందన్నారు. యూకే నుంచి వస్తోన్న ప్రయాణికులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌లో తాజాగా 58,128 మందికి వైరస్ సోకింది. జర్మనీ, రిపబ్లిక్‌ ఆఫ్ ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లో కరోనా వైరస్‌ను అరికట్టే లక్ష్యంతో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.  జర్మనీలో నిన్న 50వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. తాము మున్ముందు ఎదురయ్యే సవాళ్లకు సిద్ధం కావాలని జర్మనీ ఆరోగ్య మంత్రి అన్నారు. ఫ్రాన్స్‌, నార్వే, డెన్మార్క్‌లో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో వాటిని రిస్క్ దేశాలుగా జర్మనీ పేర్కొంది.

బ్రిటన్‌లో లక్షకు చేరువగా కేసులు.. మూడో రోజు రికార్డు!

ఒమిక్రాన్‌ వేరియంట్‌తో సతమతమవుతున్న బ్రిటన్‌లో మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూశాయి. నిన్న 93,045 మందికి వైరస్ సోకింది. ఒమిక్రాన్ వేరియంటే తాజా విజృంభణకు మూలమని అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉందని స్కాట్‌లాండ్ ఫస్ట్ మినిస్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. వారం క్రితం తాను హెచ్చరించిన సునామీ ఇప్పుడు మమ్మల్ని తాకడం ప్రారంభించిందన్నారు. ఈ కొత్త వేరియంట్ కట్టడికి ఆ దేశం వ్యాక్సినేషన్ల మీద దృష్టి పెట్టింది. సామూహిక బూస్టర్ కార్యక్రమం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

శీతకాలం వేళ అమెరికాలో ఒమిక్రాన్ అలజడి..

శీతకాలం, పండగ సీజన్‌ వేళ.. అమెరికాను ఒమిక్రాన్ కలవరపెడుతోంది. గత జనవరిలో డెల్టా వేరియంట్ అగ్రదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయగా.. ఇప్పుడు ఒమిక్రాన్‌ ఉద్ధృతి చూపిస్తోంది. తాజాగా అక్కడ 1.7లక్షల మందికి కరోనా సోకింది. ఈ సెప్టెంబర్ తర్వాత ఇదే భారీ పెరుగుదల. టీకాలు తీసుకోని వారికి ఈ శీతకాలం తీవ్రంగా ఉండనుందని అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే హెచ్చరించారు.

ఆస్ట్రేలియాలో మూడో రోజు రికార్డు కేసులు..

ఆస్ట్రేలియాలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. అధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య అధికంగా ఉంది. న్యూ సౌత్ వేల్స్‌లో 2,482, విక్టోరియాలో 1,504, క్వీన్స్‌లాండ్‌లో 31 కేసులొచ్చాయి. మొత్తంగా ఆ దేశంలో 3,820 మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం తమ దేశంలో ఐరోపా, ఉత్తర అమెరికాలోని పరిస్థితి లేదని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ అన్నారు. ప్రజలంతా వైరస్‌తో కలిసి జీవించడం అలవాటు చేసుకున్నందున.. తాము ప్రధానంగా ఆసుపత్రిల్లో చేరిక, వెంటిలేటర్లు, ఐసీయూల్లో ఉన్నవారిపైనే దృష్టిపెట్టాల్సి ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని