DK Shivakumar: ‘బెంగళూరులో నీటి ఎద్దడి లేదు’: డీకే శివకుమార్‌

వేసవి కాలం పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే బెంగళూరు వాసులు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. దీనిపై మరోసారి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) స్పందించారు.

Published : 14 Mar 2024 17:33 IST

బెంగళూరు: రాజధాని నగరం బెంగళూరు(Bengaluru)లో నీటి సంక్షోభం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) అన్నారు. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. 

‘బెంగళూరు వరకు చూసుకుంటే.. ఎలాంటి నీటి ఎద్దడి లేదు. సుమారు 7వేల బోర్లు ఎండిపోయాయి. అయితే ఆ సమస్యను ఎదుర్కొనేందుకు మేం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం.  నీటి వనరులను గుర్తించాం. ట్యాంకర్లతో నీరు సరఫరా జరిగేలా చూస్తాం’ అని వెల్లడించారు. వేసవి పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే నగరవాసులు నీటికొరతను ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇదివరకు డీకే స్పందిస్తూ.. తన నివాసంలో కూడా బోరు ఎండిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్భిక్ష పరిస్థితిని గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదన్నారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. 

బెంగళూరులో నీటి కొరతను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోని భాజపా కూడా కారణమేనంటూ ఇదివరకు శివకుమార్‌ ఆరోపించారు. నగరంలో మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే నగరంలోని వాటర్ మాఫియాకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాలను శుభ్రం చేసేందుకు, వినోదాలకు నీటిని వృథా చేసిన వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని ఇప్పటికే స్థానిక యంత్రాంగం హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని