China Bags: జీ20లో చైనా బ్యాగుల కలకలం.. రెండు కాదు.. మొత్తం 20 బ్యాగులట..!

Suspicious china bags: జీ20 సదస్సులో చైనా ప్రతినిధులు తీసుకొచ్చిన ‘అసాధారణ బ్యాగుల’పై భద్రతా సిబ్బంది దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొత్తం 20 బ్యాగులు అనుమానాస్పదంగా కన్పించినట్లు సమాచారం.

Published : 14 Sep 2023 11:59 IST

దిల్లీ: జీ20 సదస్సు (G20 Summit)లో చైనా (China) ప్రతినిధుల బృందం వెంట ఉన్న కొన్ని బ్యాగులు అనుమానాస్పదంగా (Suspicious bags) కనిపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత రెండు బ్యాగులని వార్తలు రాగా.. మొత్తం 20 అనుమానాస్పద బ్యాగులు కన్పించినట్లు తాజాగా పలు మీడియా సంస్థల కథనాలు వెల్లడించాయి. అంతేగాక, వాటిలో నిఘా పరికరాలు (surveillance equipment) ఉండి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జీ20 సదస్సు (G20 Summit) కోసం విచ్చేసిన ఆరుగురు ప్రతినిధుల చైనా బృందం దిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌లో బస చేసింది. అయితే, వారి వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో కొన్ని అసాధారణ కొలతల్లో కన్పించాయి. సాధారణంగా విదేశాల నుంచి వచ్చే వారి వస్తువులను ఎయిర్‌పోర్టులోనే పూర్తిగా తనిఖీ చేస్తారు. కానీ, ‘వియన్నా ఒప్పందం’ కింద ఉన్న దౌత్యపరమైన ప్రొటోకాల్స్‌ ప్రకారం.. చైనా ప్రతినిధుల వస్తువులను ఎయిర్‌పోర్టులో స్కాన్‌ చేయకుండానే పంపించారు.

తెలుగు విద్యార్థిని మృతి కేసులో అమెరికా పోలీసుల తీరుపై భారత్‌ అసహనం

అయితే, హోటల్‌కు చేరుకున్నాక అక్కడి భద్రతా సిబ్బంది.. ఆ బ్యాగుల సైజులు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించారు. 1x1 మీటర్ల పొడవు, వెడల్పు, మందంగా ఉన్న ఆ బ్యాగులను స్కానర్‌ కింద ఉంచాలని సదరు ప్రతినిధులను భద్రతా అధికారులు కోరారు. అందుకు వారు నిరాకరించడంతో కొంతసేపు హైడ్రామా నెలకొంది. 12 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత  చైనా అధికారులు ఆ బ్యాగ్‌లను ఎంబసీకి పంపడానికి అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మొత్తం 20 బ్యాగులు ఇలా సైజుల్లో ఉన్నట్లు తాజాగా పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఆ బ్యాగుల్లో ఏముందన్నది మాత్రం తెలియరాలేదు. అందులో ‘ఆఫ్‌ ది ఎయిర్‌’ నిఘా పరికరాలు ఉండి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై భద్రతా సిబ్బంది దర్యాప్తు ప్రారంభించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. కాగా.. ఈ వ్యవహారంపై చైనా ఎంబసీ గానీ, ఆ దేశ ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని