Dawood Ibrahim: దావూద్‌ సంబంధిత ఆస్తుల వేలం..! 171 చ.మీల స్థలానికి రూ.2 కోట్లు

దావూద్‌ ఇబ్రహీం కుటుంబీకులకు చెందిన ఆస్తులను అధికారులు వేలం వేశారు. 170.98 చ.మీల స్థలం ఏకంగా రూ.2 కోట్లు పలకడం గమనార్హం.

Published : 05 Jan 2024 22:43 IST

ముంబయి: మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది, ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం (Dawood Ibrahim) కుటుంబానికి సంబంధించిన నాలుగు ఆస్తులను శుక్రవారం వేలం వేశారు. రెండింటిని ఒకే వ్యక్తి సొంతం చేసుకోగా.. మిగతా వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇందులో 170.98 చ.మీల స్థలానికి కనీస ధర రూ.15,440గా నిర్ణయించగా.. ఏకంగా రూ.2.01 కోట్లు పలకడం గమనార్హం. రూ.1.56 లక్షలుగా నిర్ణయించిన మరో ప్లాట్‌ (1730 చ.మీలు).. రూ.3.28 లక్షలకు అమ్ముడుపోయింది.

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో దావూద్‌ ఇబ్రహీం పూర్వీకుల గ్రామమైన ముంబకేలో ఈ ఆస్తులు ఉన్నాయి. ‘స్మగ్లర్స్‌ అండ్‌ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) చట్టం-1976’ కింద ముంబయిలో ఈ వేలం ప్రక్రియ నిర్వహించారు. రెండు ఆస్తులు దక్కించుకున్న వ్యక్తి పేరును అధికారులు వెల్లడించలేదు. ఆయన దిల్లీకి చెందిన న్యాయవాదిగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. గత తొమ్మిదేళ్లలో దావూద్ కుటుంబానికి చెందిన 11 ఆస్తులను వేలం వేసిన అధికారులు.. సుమారు రూ.12 కోట్లు సమీకరించినట్లు తెలుస్తోంది.

దావూద్‌ ఇబ్రహీం.. అనేకసార్లు ‘చచ్చిన’ మోస్ట్‌వాంటెడ్‌!

దావూద్‌ ఇబ్రహీం 1980ల్లోనే పాకిస్థాన్‌కు పారిపోయాడు. 1993లో జరిగిన ముంబయి వరుస పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. అమెరికాతోపాటు ఐరాస కూడా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐరాస జాబితాలో అతడి చిరునామా కరాచీగా ఉంది. అయితే, అతడు తమ దేశంలో తలదాచుకున్న విషయాన్ని చెప్పడానికి పాక్‌ వెనకాడుతూనే ఉంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టు నుంచి బయటపడేందుకు తప్పని పరిస్థితుల్లో (2020లో) ఒకసారి మాత్రం అంగీకరించినట్లు సమాచారం. ఇటీవల దావూద్ చనిపోయాడనే వార్తలు వినిపించాయి. విషప్రయోగం జరిగిందని, కరాచీలో ఓ ఆసుపత్రిలో చేరాడని కథనాలు వెలువడ్డాయి. అయితే వీటిపై ఎలాంటి ధ్రువీకరణ లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు