Sanatan Dharma: ఉదయనిధి వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం : ముఖ్యమంత్రి స్టాలిన్‌

సనాతన ధర్మంపై (Sanatan Dharma) మంత్రి, తన కుమారుడు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) పేర్కొన్నారు.

Published : 07 Sep 2023 17:29 IST

చెన్నై: సనాతన ధర్మంపై (Sanatan Dharma) మంత్రి, తన కుమారుడు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్‌ (MK Stalin) సమర్థించారు. సనాతన ధర్మంలో కొన్ని అసమానతలపైనే ఉదయనిధి (Udhayanidhi) తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్నారు. వీటికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని భాజపా అనుకూల శక్తులు సహించలేక పోతున్నాయన్నారు. అందుకే ఉదయనిధిని లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నారని.. అటువంటి వారితో ప్రధాని మోదీ కూడా ఎందుకు ఏకీభవిస్తున్నారో అర్థం కావడం లేదని స్టాలిన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘సనాతన ధర్మం బోధించిన సూత్రాల్లో కొన్ని సూత్రాలపై ఉదయనిధి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వెనకబడిన కులాలు, ఆదివాసీలు, మహిళలపై వివక్ష గురించి ఆయన మాట్లాడారు. అంతేకాని ఏ వర్గాన్నీ, ఎవరి మత విశ్వాసాలను కించపరిచే ఉద్దేశం కాదు’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్‌ పేర్కొన్నారు. కొన్ని భాజపా అనుకూల మూకలు.. ఉత్తరాది రాష్ట్రాల్లో దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వారు చెబుతున్న ‘అభ్యంతరకర పదాన్ని’ ఉదయనిధి ఎప్పుడూ వాడలేదని స్టాలిన్‌ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌లు అదే అబద్ధాన్ని చెప్పడం శోచనీయమన్నారు.

దృష్టి మరల్చేందుకే ‘సనాతన రగడ’.. కేసులన్నీ చట్టపరంగా ఎదుర్కొంటా: ఉదయనిధి

జాబిల్లిపై చంద్రయాన్‌ను విజయవంతంగా పంపించిన నేటి కాలంలోనూ.. కొంతమంది కుల వివక్షను ప్రచారం చేయడం దారుణమని స్టాలిన్‌ పేర్కొన్నారు. మరికొంత మంది మాత్రం అనేక విషయాల్లో మహిళలను బహిరంగంగా కించపరుస్తూనే ఉన్నారన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై సరైన విధంగా స్పందించాలని ప్రధాని మోదీ కూడా మంత్రులతో చెప్పడం బాధాకరమన్నారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను నిర్దారించుకోవడానికి ప్రధానికి అన్ని వనరులున్నప్పటికీ.. ఆయన తెలియక అలా మాట్లాడుతున్నారో..?లేక తెలిసి మాట్లాడుతున్నారో..? అర్థం కావడం లేదని ఎం కే స్టాలిన్‌ పేర్కొన్నారు. అంతకుముందు ఇదే విషయంపై మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్‌.. తాను చేసిన వ్యాఖ్యలను భాజపా వక్రీకరిస్తోందని.. తనపై నమోదైన అన్ని కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని