Matsya 6000 : త్వరలో ‘సముద్రయాన్‌’.. మత్స్య-6000 జలాంతర్గామి ఫొటోలు విడుదల చేసిన కేంద్రమంత్రి

‘సముద్రయాన్‌’ (Samudrayaan) ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి మత్స్య-6000 (Matsya 6000) ఫొటోలను కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) ట్వీట్ చేశారు. 

Published : 11 Sep 2023 20:24 IST

Image : KirenRijiju

చెన్నై : ‘చంద్రయాన్‌-3’ (Chandrayaan-3) విజయంతో ఊపుమీదున్న భారత్ (India).. త్వరలో ‘సముద్రయాన్‌’కు (Samudrayaan) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి మత్స్య-6000 (Matsya 6000) తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆ సబ్‌ మెరైన్‌ ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. సముద్ర గర్భ అన్వేషణలో తోడ్పడే మానవ సహిత జలాంతర్గామి ఇదేనని చెప్పారు. ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) అభివృద్ధి చేసింది. ఇది ప్రారంభమైతే భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్‌గా దీనికి గుర్తింపు దక్కనుంది. ఆక్వానాట్‌లను ఆరు వేల మీటర్ల లోతు వరకు తీసుకెళ్లేందుకు గోళాకార నౌకను నిర్మించనున్నారు. తొలుత ఇది 500 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మిషన్‌ కారణంగా సముద్ర గర్భంలోని పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్రమంత్రి తెలిపారు. 

బ్యాండేజ్‌తో కనిపించిన న్యాయవాది.. ఆరా తీసిన సీజేఐ.. ఆ తర్వాత!

‘‘తదుపరి ప్రయాణం.. ‘సముద్రయాన్‌’. ఇది చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీలో నిర్మితమవుతున్న మత్స్య-6000 జలాంతర్గామి. భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్‌ ఓషన్‌ మిషన్‌ సముద్రయాన్‌లో భాగంగా దీనిని రూపొందిస్తున్నారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చు. దాంతో సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయొచ్చు. ఈ వ్యవస్థ సముద్ర పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలిగించదని’’ పేర్కొంటూ కిరణ్‌ రిజిజు ట్వీట్ చేశారు. ‘బ్లూ ఎకానమీ’ని ప్రోత్సహించడంలో భాగంగా భారత్ ఈ డీప్‌ ఓషన్‌ మిషన్‌ను చేపట్టింది. సముద్ర గర్భంలో అపారమైన ఖనిజ నిల్వలున్నాయి. అలాగే అరుదైన జీవజాలం అక్కడ నివసిస్తోంది. వాటిని సమర్థవంతంగా వినియోగిస్తే ఆర్థికవృద్ధి, నూతన ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జలాంతర్గామిలో కూర్చొని పరిశీలించిన కిరణ్‌ రిజిజుకు దాని విశేషాల గురించి నిపుణులు వివరించారు. 2026 నాటికి ఈ మిషన్‌ కార్యరూపం దాల్చే అవకాశం ఉందని గతంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని