Lottery: నెలనెలా రూ.5.5 లక్షలు.. అలా 25 ఏళ్లపాటు.. యూపీ వాసిని వరించిన అదృష్టం

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. యూఏఈ నిర్వహించిన మెగా ప్రైజ్‌ మనీ లక్కీ డ్రాలో తొలి విజేతగా నిలిచాడు. దీంతో అతడు నెలనెలా రూ.5.5లక్షల చొప్పున 25 ఏళ్ల పాటు అందుకోనున్నాడు. 

Updated : 29 Jul 2023 06:03 IST

దుబాయి: ఎలాంటి పనిచేయకుండానే నెలనెలా లక్షల రూపాయలు.. అలా ఒక నెల, సంవత్సరం కాదు.. ఏకంగా 25 ఏళ్లపాటు వస్తాయి. వింటుంటే ఆసక్తిగా ఉందికదా.. ఇది నిజమే. సామాన్యుడికి లక్కీడ్రా(lucky draw)లో లక్ష రూపాయలు తగిలినా అతడి ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటిది ఓ వ్యక్తికి ఏకంగా నెలకు రూ.5.5 లక్షల చొప్పున 25 ఏళ్ల పాటు వచ్చే జాక్‌పాట్‌ తగిలింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) ‘ఫాస్ట్‌ 5’(FAST 5) పేరిట నిర్వహించిన లాటరీలో ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) వాసి ఒకరు మెగా ప్రైజ్‌ మనీ విజేతగా నిలిచాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

యూపీకి చెందిన మొహమ్మద్‌ ఆదిల్‌ ఖాన్‌ కొంతకాలంగా దుబాయ్‌లోని ఒక రియల్‌ఎస్టేట్‌ సంస్థలో ఇంటీరియర్‌ డిజైన్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల యూఏఈ ‘ఫాస్ట్‌ 5’(FAST 5) పేరిట లాటరీ తీసింది. ఆ మెగా ప్రైజ్‌ మనీ డ్రాలో అతడు మొదటి విజేతగా నిలిచాడు. ఈ విషయాన్ని గురువారం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఆ లాటరీ ప్రకారం ప్రకారం విజేతకు నెలకు రూ.5,59,822 (25,000 దిర్హమ్‌లు) చొప్పున 25 ఏళ్లపాటు ఇవ్వనున్నారు. దీంతో విజేతగా నిలిచిన ఆదిల్‌ ఖాన్‌ ఉబ్బితబ్బివుతున్నాడు. 

చిర్రెత్తి.. సిద్ధూ కారుకే అడ్డుపెట్టాడాయన!

‘‘ డ్రాలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ముఖ్య సమయంలో డబ్బులు రాబోతున్నాయి. నా కుటుంబానికి నేనే ఏకైక జీవనాధారం. కొవిడ్‌ సమయంలో మా అన్న చనిపోయాడు. అతడి కుటుంబాన్నీ నేనే పోషిస్తున్నాను. నాకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఐదేళ్ల పాప ఉంది. ఇలాంటి సమయంలో ఇలా అదనపు రాబడి నాకు ఎంతో కీలకం. నేను లాటరీ గెలిచానని ఇంట్లో చెప్పినప్పుడు మా కుటుంబం తొలుత నమ్మలేదు. ఆ వార్త నిజమో లేదో తెలుసుకోవడానికి ఒకటికి రెండుసార్లు సరిచూసుకోమని చెప్పారు. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నా’’ అని ఆదిల్‌ ఖాన్‌ చెప్పాడు. 

ఎమిరైట్స్‌ లాటరీ నిర్వహించే టైచెరస్‌ మార్కెటింగ్‌ హెడ్‌ మాట్లాడుతూ.. ‘‘ఫాస్ట్‌ 5’ లక్కీడ్రాను ప్రారంభించిన 8 వారాలలోపే తొలి విజేతను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. స్వల్ప సమయంలోనే ఓ వ్యక్తి మల్టీ మిలియనీర్‌ కావడానికి మేము ‘ఫాస్ట్‌ 5’ను తీసుకొచ్చాం. విజేత ప్రయోజనాలను ఆశించే ఒకేసారి కాకుండా నెలకోసారి ఇలా డబ్బులు ఇచ్చే ఆలోచన చేశాం’’ అని ఆయన పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని