US: భారత్‌ను ఆకట్టుకునేందుకు.. అమెరికా ‘ఆపరేషన్‌ ఎయిర్‌షో’

ఆయుధ కొనుగోళ్ల అంశంలో భారత్‌ను ఆకట్టుకునేందుకు అమెరికా (US) ప్రయత్నిస్తోంది. తాజాగా బెంగళూరులో జరుగుతున్న వైమానిక ప్రదర్శన (Aero India)లో అగ్రరాజ్యం తొలిసారిగా అత్యాయుధునిక యుద్ధ విమానాలను ప్రదర్శించింది.

Published : 18 Feb 2023 00:57 IST

ఎయిర్‌షోలో దూసుకెళ్తున్న అమెరికా ఎఫ్‌-35 యుద్ధ విమానం

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతున్న 14వ ‘ఏరో ఇండియా (Aero India 2023)’ ప్రదర్శనకు విదేశాల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా (US) తమ అత్యాధునిక ‘ఎఫ్‌-35 (F-35 F-35 Fighter jets)’ యుద్ధ విమానాలను తొలిసారిగా భారత్‌కు తీసుకొచ్చింది. వీటితో పాటు ఎఫ్‌-16, సూపర్‌ హార్నెట్స్‌, బి-1బీ బాంబర్లను కూడా ప్రదర్శించింది. అయితే అమెరికా ఉత్సాహం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సైనిక కొనుగోళ్లలో భారత్‌కు రష్యా (Russia)ను దూరం చేసి దిల్లీని ఆకట్టుకునేందుకు అగ్రరాజ్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

సైనిక కొనుగోళ్ల విషయంలో సోవియట్‌ కాలం నుంచి భారత్‌కు రష్యా ప్రధాన ఆయుధ (weapons) సరఫరాదారుగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఇటీవల ఉక్రెయిన్‌ (Ukraine)పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా నుంచి సరఫరా ఆలస్యమవుతోంది. మరోవైపు సోవియెట్‌ కాలం నాటి యుద్ధ విమానాలను ఆధునీకీకరించి తమ గగన శక్తిని పెంచుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఈ క్రమంలోనే దిల్లీని ఆకట్టుకునేందుకు అమెరికా (US).. ‘ఏరో ఇండియా’ ప్రదర్శనను రెండు చేతులా ఉపయోగించుకుంటోంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ ప్రదర్శనలో అమెరికా ప్రతినిధుల బృందం తమ యుద్ధ విమానాలు, బాంబర్లతో పాల్గొంది.

ఎఫ్‌-35 యుద్ధ విమానాల గురించి భారత్ (India)‌, అమెరికా (US) మధ్య ఇంతవరకూ చర్చలు జరగలేదు. అయినప్పటికీ ఏరో ఇండియాలో తొలిసారిగా వాటిని ప్రదర్శించడం.. దిల్లీతో అమెరికా వ్యూహాత్మక బంధం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. కాగా.. ఈ ఎఫ్‌-35 యుద్ధ విమానాలను అగ్రరాజ్యం చాలా తక్కువ దేశాలకు ఎంపిక ప్రాధాన్యంలో విక్రయిస్తోంది. భారత్‌కు వీటిని అందిస్తారా లేదా అన్నదానిపై అమెరికా ఎంబసీ అధికారి రేర్‌ అడ్మిరల్‌ మైఖెల్‌ బేకర్‌ను ప్రశ్నించగా.. దీనిపై ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా.. గతేడాది ఏరో ఇండియా (Aero India) ప్రదర్శనలో రష్యాకు చెందిన రోసోబోరన్‌ఎక్స్‌పోర్ట్‌ స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. ఈ ఏడాది వైమానిక ప్రదర్శనలో మాస్కో పెద్దగా ఉత్పత్తులను ప్రదర్శించలేదు. కేవలం ట్రక్కులు, రాడార్లు, ట్యాంకర్లు వంటివి ప్రదర్శించింది.

బెంగళూరు శివారులోని యలహంక వైమానిక స్థావరం వేదికగా ఫిబ్రవరి 13న మొదలైన ఏరో ఇండియా ప్రదర్శన శుక్రవారం (ఫిబ్రవరి 17)తో ముగియనుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని