Jaishankar: పశ్చిమ దేశాలు దశాబ్దాల తరబడి ఆయుధాలు సరఫరా చేయలేదు: భారత్‌

భారత ఆయుధాగారంలో చెప్పుకోదగ్గ స్థాయిలో రష్యా ఆయుధాలు ఉండటానికి పశ్చిమదేశాల వైఖరే కారణమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు.

Published : 10 Oct 2022 22:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత ఆయుధాగారంలో గణనీయంగా రష్యా ఆయుధాలు ఉండటానికి పశ్చిమదేశాల వైఖరే కారణమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు. ఆ దేశాలు ఈ ప్రాంతంలో సైనిక నియంతృత్వం పక్షం వహించి భారత్‌కు దశాబ్దాల తరబడి ఆయుధాలు సరఫరా చేయలేదన్నారు. ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. సోమవారం ఆయన ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పెన్నీ వాంగ్‌తో కలిసి కాన్‌బెర్రాలో సంయుక్త విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జైశంకర్‌ మాట్లాడుతూ భారత్‌-రష్యాల మధ్య సుదీర్ఘ బంధం న్యూదిల్లీకి ప్రయోజనకరంగా ఉందన్నారు. రష్యా ఆయుధాలపై ఆధారపడటాన్ని భారత్‌ తగ్గించుకోగలదా ఒక ఆస్ట్రేలియా విలేకరి ప్రశ్నించడంతో జైశంకర్‌ స్పందిస్తూ.. ‘‘మా వద్ద గణనీయంగా రష్యా ఆయుధాలు ఉన్నాయి. పలు కారణాలతో ఆ దేశ ఆయుధాల సంఖ్య మా వద్ద పెరిగిపోయింది. ఆయుధ వ్యవస్థల ఆవశ్యకత మీకు తెలుసు. కానీ, దశాబ్దాల తరబడి పశ్చిమ దేశాలు భారత్‌కు ఆయుధాలను అందించలేదు. అంతేకాదు.. మా పొరుగున ఉన్న ఓ సైనిక నియంతృత్వ దేశాన్ని(పాకిస్థాన్‌) భాగస్వామిగా ఎంచుకొన్నారు. ప్రతి సైనిక సంక్షోభం వలే.. ప్రస్తుతం సంక్షోభం నుంచి నేర్చుకొనే అంశాలు ఉన్నాయి. దీంతో పాటు మా సైనిక సహచరులు కూడా జాగ్రత్తగా దీనిని అధ్యయనం చేస్తున్నారు’’ అని జైశంకర్‌ పేర్కొన్నారు.

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చట్టసభల ఆమోదం దిశగా పయనిస్తోందని జైశంకర్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో ద్వంద్వ పన్నులను నివారించే అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇది భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో భాగంగా జైశంకర్‌ ఆస్ట్రేలియా మినిస్టర్స్‌ ఫ్రేమ్‌ వర్క్‌ చర్చల్లో కూడా పాల్గొంటారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని